న్యూఢిల్లీ: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, ఇండియా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌ను నేషనల్ ఇన్వి్స్టిగేషన్ ఏజెన్సీ (NIA) అరెస్ట్ చేసింది. అమెరికా దేశ బహిష్కరణ వేటు వేయడంతో బుధవారం (నవంబర్ 19) ఇండియా వచ్చిన అన్మోల్ బిష్ణోయ్‌ను ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ భద్రత నడుమ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా పాటియాలా హౌస్ కోర్టుకు తరలించారు.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడైన అన్మోల్ బిష్ణోయ్ ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. తన సోదరుడు లారెన్స్ బిష్ణోయ్ జైల్లో ఉండటంతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాలను అన్మోలే నడిపిస్తున్నాడు. ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ, పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య, బాలీవుడ్ స్టార్ట్ హీరో సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల వంటి హైప్రొఫైల్ కేసుల్లో అన్మోల్ నిందితుడిగా ఉన్నాడు. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో అన్మోల్ ఒకడు. అన్మోల్ బిష్ణోయ్‌పై ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది.
►ALSO READ | డబుల్ మర్డర్ మిస్టరీ బయటపెట్టిన కాగ్నిజెంట్ టెక్కీ ల్యాప్‌టాప్.. 8 ఏళ్ల తర్వాత ఏమైందంటే..?
ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న అన్మోల్ అక్కడి నుంచే ఇండియాలో నేరాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. అతడిని ఇండియా తీసుకొచ్చేందుకు భారత ఏజెన్సీలు ఎప్పటినుంచో తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో 2025, ఫిబ్రవరిలో అన్మోల్ అమెరికాలో అరెస్టు అయ్యాడు. యూఎస్ ఇమ్మిగ్రేషన్ విభాగం అతడిని పట్టుకుని దేశ బహిష్కరణ వేటు వేసింది.
దీంతో అన్మోల్ను ఇండియా తీసుకొచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ క్రమంలోనే అతడిని అమెరికా నుంచి ఇండియాకు తీసుకొచ్చారు అధికారులు. అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా నుంచి తిరిగి ఇండియాకు తీసుకురావడం ఢిల్లీ, పంజాబ్, ముంబై, గుజరాత్ సహా వివిధ రాష్ట్రాల్లోని కేంద్ర దర్యాప్తు సంస్థలు, పోలీసు బలగాలకు ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు. అన్మోల్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ఎన్ఐఏ వివిధ కేసుల్లో మరిన్నీ వివరాలు రాబట్టేందుకు నిందితుడిని కస్టడీకి ఇవ్వాలనే కోరే అవకాశం ఉంది.
