IND vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఇండియా స్క్వాడ్ ప్రకటన.. అయ్యర్‌కు వైస్ కెప్టెన్సీ.. బుమ్రాకు రెస్ట్

IND vs AUS:  ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఇండియా స్క్వాడ్ ప్రకటన.. అయ్యర్‌కు వైస్ కెప్టెన్సీ.. బుమ్రాకు రెస్ట్

అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ కు టీమిండియా స్క్వాడ్ వచ్చేసింది. అజిత్ అగార్కర నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ శనివారం (అక్టోబర్ 4) న ప్రకటించింది. యువ బ్యాటర్ శుభమాన్ గిల్ టీమిండియాకు కొత్త వన్డే కెప్టెన్ గా ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ స్థానంలో గిల్ సారధ్య బాధ్యతలు స్వీకరించనున్నాడు. శ్రేయాస్ అయ్యర్ ని వైస్ కెప్టెన్ గా ప్రకటించారు. టీమిండియా వన్డే కెప్టెన్సీ కోల్పోయిన రోహిత్ శర్మ ప్లేయర్ గా జట్టులో కొనసాగనున్నాడు. సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ కూడా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు ఎంపికయ్యాడు.

పని భారం కారణంగా జస్ప్రీత్ బుమ్రాకు ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కు రెస్ట్ ఇచ్చారు. కేఎల్ రాహుల్ స్పెషలిస్ట్ వికెట్ కీపర్ గా కొనసాగనున్నాడు. సంజు శాంసన్ ను కాకుండా ధృవ్ జురెల్ ను బ్యాకప్ వికెట్ కీపర్ గా ఎంపిక చేశారు. పాండ్య లేకపోవడంతో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా సెలక్టయ్యాడు. జడేజాకు రెస్ట్ ఇవ్వడంతో స్పిన్ ఆల్ రౌండర్లు వాషింగ్ టన్ సుందర్, అక్షర్ పటేల్ కు స్క్వాడ్ లో చోటు దక్కింది.  బ్యాకప్ ఓపెనర్ గా జైశ్వాల్ కు చోటు కల్పించారు. నలుగురు స్పెషలిస్ట్ పేసర్లుగా సిరాజ్ తో పాటు హర్షిత్ రానా, ప్రసిద్ కృష్ణ, అర్షదీప్ సింగ్ చోటు దక్కించుకున్నారు. 

వన్డేతో పాటు ఆస్ట్రేలియా టూర్ కు ఇండియా టీ20 స్క్వాడ్ ను కూడా ఎంపిక చేశారు. ఆసియా కప్ కు ఎంపిక చేసిన 15 మంది స్క్వాడ్ ను అలాగే ఉంచారు. కొత్తగా ఆల్ రౌండర్ నితీష్ కుమార్ కు జట్టులో చోటు కల్పించారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్ గా జట్టులో కొనసాగనున్నారు.  

అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో సిరీస్: 

2020 తర్వాత ఇండియా తొలిసారి వైట్ బాల్ ఫార్మాట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్.. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 19న పెర్త్ లో తొలి వన్డేతో టూర్ మొదలవుతుంది. అక్టోబర్ 23 న అడిలైడ్ లో రెండో వన్డే.. అక్టోబర్ 25 న సిడ్నీలో మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 29 న మనుకా ఓవల్ లో తొలి టీ20 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మెల్‌బోర్న్, హోబర్ట్, గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్ లలో వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. 

 

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు భారత వన్డే జట్టు :

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ , హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ధృవ్ జురెల్, యశస్వి జైశ్వాల్ 

భారత టీ20 జట్టు: 

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రానా, సంజు శాంసన్, రింకూ సింగ్,  వాషింగ్టన్ సుందర్