ఆసియా ఆర్చరీలో ఇండియా టాప్ షో.. ధీరజ్‌‌‌‌, అంకిత, మెన్స్ రికర్వ్ టీమ్‌‌‌‌కు స్వర్ణాలు

ఆసియా ఆర్చరీలో ఇండియా టాప్ షో.. ధీరజ్‌‌‌‌, అంకిత, మెన్స్ రికర్వ్ టీమ్‌‌‌‌కు స్వర్ణాలు

ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇండియా ఆర్చర్లు అదరగొట్టారు. ఏపీ కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌‌‌‌, అంకితా భకత్ స్వర్ణాలతో మెరవగా.. మెన్స్ రికర్వ్‌‌‌‌ టీమ్‌‌‌‌ 18 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ బంగారు పతకం సొంతం చేసుకుంది. దాంతో మొత్తంగా ఆరు స్వర్ణాలు సహా పది పతకాలు నెగ్గిన ఇండియా అగ్రస్థానంతో టోర్నీని ముగించింది. ఆఖరి రోజు, శుక్రవారం జరిగిన విమెన్స్ రికర్వ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో  అంకిత 7–-3తో  పారిస్ ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్‌‌‌‌  నామ్ సుహ్యోన్‌‌‌‌ ( సౌత్ కొరియా)కు షాకిచ్చి చాంపియన్‌‌‌‌గా నిలిచింది.  

కాంస్య పతక పోరులో సంగీత 6–--5తో స్టార్ ఆర్చర్ దీపికా కుమారిని ఓడించింది. ఇక, ఇద్దరు ఇండియన్స్ మధ్య జరిగిన మెన్స్ రికర్వ్ ఫైనల్లో ధీరజ్ 6-–2 తో తోటి ఆర్చర్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌పై గెలిచి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. రాహుల్ రజతంతో సరిపెట్టుకున్నాడు. మెన్స్‌‌‌‌ రికర్వ్ టీమ్ ఈవెంట్‌‌‌‌లో యశ్‌‌‌‌దీప్ భోగే, అటాను దాస్, రాహుల్‌‌‌‌తో కూడిన ఇండియా జట్టు అద్భుతం చేసింది. 

నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఫైనల్లో ఓ దశలో 2–4తో వెనుకంజ వేసినా గొప్పగా పుంజుకొని షూటాఫ్‌‌‌‌లో 5–4తో బలమైన సౌత్ కొరియాను ఓడించింది. షూటాఫ్‌‌‌‌లో ఇరు జట్లూ 29 పాయింట్లు రాబట్టాయి. అయితే అటాను దాస్‌‌‌‌ చివరి బాణం ప్రత్యర్థికంటే సెంటర్‌‌‌‌‌‌‌‌కు దగ్గరగా ఉండటంతో ఇండియానే విజయం వరించింది. ఈ మెగా టోర్నీలో ఇండియా మొత్తంగా 6 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యం గెలిచింది.