సంచియోన్: ఇండియా టాప్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు కొరియా ఓపెన్ సూపర్–500 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో ఐదోసీడ్ శ్రీకాంత్ 21–12, 18–21, 21–12తో సన్ వాన్‌హో (కొరియా)ను ఓడించాడు. సన్‌తో తలపడిన గత ఏడుసార్లలో శ్రీ నాలుగుసార్లు ఓడాడు. కానీ ఈసారి పట్టువిడవకుండా పోరాడి అనుకున్న ఫలితాన్ని సాధించాడు. గంటా 2 నిమిషాల పోరాటంలో సన్ నుంచి గట్టిపోటీ ఎదురైనా.. శ్రీకాంత్ రిటర్న్స్, డ్రాప్ షాట్స్‌లో తన నైపుణ్యాన్ని చూపెట్టాడు. విమెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో మూడోసీడ్ సింధు 21–10, 21–16తో బుసానన్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. బుసానన్‌పై సింధుకు ఇది 17వ విజయం కావడం విశేషం. 44 నిమిషాల మ్యాచ్‌లో తెలుగమ్మాయికి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. ఇక, మెన్స్ డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ షెట్టి 20–22, 21–18, 20–22తో కంగ్ మిన్‌యుక్–సీయో సెంగాజే (కొరియా) చేతిలో ఓడగా.. విమెన్స్ డబుల్స్‌లో అశ్విని–సిక్కి రెడ్డి 19–21, 17–21తో హె వోన్–రియోంగ్ కిమ్ (కొరియా) చేతిలో పరాజయం పాలయ్యారు.
