T20 World Cup 2024: నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికా టూర్‌కు భారత్

T20 World Cup 2024: నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికా టూర్‌కు భారత్

నాలుగు మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం టీమిండియా దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టనుంది. 2024 నవంబర్ లో ఈ సిరీస్ జరగనుంది. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 8 నుంచి 15 వరకు జరగబోయే ఈ టోర్నీకి నాలుగు వేదికలను కన్ఫర్మ్ చేశారు. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో తొలి టీ20 తో సిరీస్ ప్రారంభమవుతుంది. గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ లో రెండో టీ20 జరుగుతుంది. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌, జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్‌లో వరుసగా మూడు, నాలుగు టీ20 మ్యాచ్ లకు ఆతిధ్యమిస్తాయి. 

దక్షిణాఫ్రికా క్రికెట్ ఛైర్‌పర్సన్ లాసన్ నైడూ ఈ సిరీస్ పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్ పై ఎంతో సంతోషంగా ఉన్నామని.. బీసీసీఐ ఎప్పుడూ తమకు మద్దతుగా ఉంటుందని కృతజ్ఞతలు తెలిపారు. భారత క్రికెట్ జట్టు పర్యటన అద్భుతంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తారని.. రెండు కూడా అద్భుత జట్లని ఆయన తెలిపాడు. 

2024-25 సీజన్‌కు సంబంధించి స్వదేశంలో జరగనున్న టీమిండియా మ్యాచ్‍ల షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం(జూన్ 20) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో హోమ్ సీజన్ ప్రారంభమవుతుంది.

సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 12 వరకు బంగ్లా జట్టు.. భారత్‌లో పర్యటించనుంది. ఈ టూర్‌లో ఇరు జట్ల మధ్య 2 టెస్టులు, 3 టీ20లు జరగనున్నాయి. తొలి టెస్టుకు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుండగా.. రెండో టెస్టు కాన్పూర్‌లో జరగనుంది. అనంతరం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లు ధర్మశాల, ఢిల్లీ, హైదరాబాద్‌ వేదికగా జరగనున్నాయి.

అక్టోబరు 16 నుంచి న్యూజిలాండ్‌ టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి టెస్టు  బెంగుళూరులో, రెండో టెస్టు పూణేలో, చివరి టెస్టు ముంబైలో జరగనుంది.

కొత్త ఏడాది ప్రారంభంలో భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య సుదీర్ఘ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ  ఇరు జట్ల ఐదు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనున్నాయి. టీ20 సిరీస్‌కు చెన్నై, కోల్‌కతా, రాజ్‌కోట్, పుణె, ముంబై ఆతిథ్యం ఇవ్వనుండగా.. వన్డేలకు నాగ్‌పూర్, కటక్, అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.