గ్లోబల్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్‌లో భారత్ కీలకపాత్ర పోషించాలని కోరుకుంటున్నామని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తెలిపారు. భారత్ ఉత్పత్తి సామర్థ్యం అమోఘమని మెచ్చుకున్న గుటెర్రస్.. ఇండియా తన కెపాసిటీని వినియోగించుకొని ప్రపంచానికి అండగా నిలవాలన్నారు. ‘భారత్‌లో దేశీయంగా రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌లను భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నారని తెలుస్తోంది. టీకా కోసం భారత్‌లోని కంపెనీలతో మేం సంప్రదింపులు జరుపుతున్నాం.
గ్లోబల్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం కావడానికి ఇండియా తన శక్తి, సామర్థ్యాల మేర మాకు సాయపడుతుందని నమ్ముతున్నాం. ఇప్పటికే వాడుతున్న వ్యాక్సిన్‌లకు లైసెన్స్‌లు ఇవ్వడంలో తాత్సారం చేయొద్దని అన్ని దేశాలను కోరుతున్నాం’ అని గుటెర్రస్ చెప్పారు. శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి పొరుగు దేశాలకు భారత్ 55 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిన నేపథ్యంలో గుటెర్రస్ పైవిధంగా స్పందించారు. కాగా, త్వరలో ఒమన్, నికరగువా, పసిఫిక్ ఐల్యాండ్ స్టేట్స్‌కు టీకా డోసులను పంపనున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ్ తెలిపారు.
