వ్యాక్సిన్ తయారీలో భారత్ సామర్ధ్యం ప్రపంచానికే పెద్ద ఆస్తి

వ్యాక్సిన్ తయారీలో భారత్ సామర్ధ్యం ప్రపంచానికే పెద్ద ఆస్తి

కరోనాను అరికట్టడం కోసం భారీ స్థాయిలో టీకాలను తయారు చేయగల భారత సామర్థ్యం… ప్రపంచానికే ఓ పెద్ద ఆస్తి అని అన్నారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌. వరల్డ్ వైడ్ గా ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భారత్‌ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లో దేశీయంగా అనేక టీకాలు తయారవుతున్న విషయం తమకు తెలుసని, ఆయా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించేందుకు భారత్‌  కూడా సిద్ధంగా ఉందని తాము ఆశిస్తున్నామన్నారు. కరోనా వ్యాక్సిన్ ప్రపంచ దేశాలకు వీలైనంత త్వరగా చేరే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన టీకాల తయారీ లైసెన్స్‌లను ఆయా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్పత్తి సెంటర్లకు బదిలీ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

భారత్‌ ఇప్పటి వరకు 55 లక్షల డోసులను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు బహుమతిగా పంపింది. త్వరలో కరీబియన్‌ దేశాలతో పాటు, పసిఫిక్‌ ద్వీప దేశాలకు కూడా టీకా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ తెలిపారు. అలాగే ఆఫ్రికా దేశాలకు ప్రత్యేకంగా కోటి డోసుల్ని, ఐక్యరాజ్య సమితికి 10 లక్షల డోసుల్ని ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.