T20 World Cup: మోడీ స్టేడియంలో భారత్‌కు అద్భుతమైన టీ20 రికార్డు.. మరీ ఫైనల్లో ఏం చేస్తారో..?

T20 World Cup: మోడీ స్టేడియంలో భారత్‌కు అద్భుతమైన టీ20 రికార్డు.. మరీ ఫైనల్లో ఏం చేస్తారో..?

 
T20 World Cup:
అహ్మదాబాద్ నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరుగాంచిన నరేంద్ర మోడీ స్టేడియంలో ఇవాళ ( మార్చి 8న ) సాయంత్రం 7 గంటలకు జరిగే టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్‌ జట్లు తలపడబోతున్నాయి. ఈ కీలక పోరులో ఇండియన్ టీమ్ మూడో టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ని దక్కించుకోవాలని పట్టుదలతో ముందుకు సాగుతుంది. దీంతో ఈ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో భారీగా ఆసక్తి నెలకొంది.  

అహ్మదాబాద్‌లో భారత్ రికార్డు: 
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడ ఇప్పటివరకు ఇండియన్ టీమ్ మొత్తం 10  టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా, వాటిలో 7 మ్యాచ్‌లలో విజయం సాధించింది. అంటే సుమారు 70 శాతం విజయశాతం ఇక్కడ ఉంది. ఈ టోర్నమెంట్‌లో కూడా భారత్ ఇప్పటికే ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడింది. నెదర్లాండ్స్‌పై విజయం సాధించగా, దక్షిణాఫ్రికా చేతిలో మాత్రం ఓడిపోయింది. అయినప్పటికీ ఈ స్టేడియంలోని పిచ్ పరిస్థితుల గురించి టీమిండియాకు మంచి అవగాహన ఉంది. 
  
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం: 
2020లో పునర్నిర్మాణం చేసిన నరేంద్ర మోడీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందింది. సుమారు 63 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ స్టేడియంలో దాదాపు 1.3 లక్షల మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉంది. ఈ స్టేడియంలో 11 సెంటర్ పిచ్‌లు, నాలుగు డ్రెస్సింగ్ రూమ్‌లు, ఆధునిక LED లైటింగ్ వ్యవస్థ ఉన్నాయి. అందువల్ల ఇది ప్రపంచంలో అత్యాధునిక క్రికెట్ వేదికల్లో ఒకటిగా నిలిచింది.

భారత్‌కు తీపి–చేదు జ్ఞాపకాలు: 
ఈ స్టేడియం భారత్‌ కొన్ని గొప్ప విజయాలను అందుకోగా, కొన్ని బాధాకరమైన ఓటములు కూడా ఉన్నాయి. 2011 వన్డే వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ ఇక్కడే విజయం సాధించింది. అయితే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అదే ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడింతే కూడా ఇక్కడే. దీంతో ఈ వేదిక ఇండియన్ అభిమానులకు తీపి–చేదు జ్ఞాపకాల మేళవింపుగా నిలిచింది.

ఫైనల్ పిచ్ పరిస్థితులు: 
అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా హై స్కోరింగ్ మ్యాచ్‌లకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఫైనల్ కోసం పిచ్‌ను బ్లాక్ సోయిల్ అండ్ రెడ్ సోయిల్ మిశ్రమంతో తయారు చేసినట్లు తెలుస్తుంది. ఈ పిచ్‌పై స్పిన్నర్లకు పెద్దగా సహాయం ఉండకపోవచ్చు.. పేసర్లకు మాత్రం మంచి బౌన్స్ లభించే అవకాశం ఉంది. అలాగే బ్యాటింగ్‌కు కూడా అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసే జట్టు 200+ కు పైగా స్కోరు చేయాల్సిన అవసరం ఉంది.  

నెల రోజుల తర్వాత మళ్లీ మ్యాచ్: 
నరేంద్ర మోడీ స్టేడియంలోని పిచ్‌పై ఈ టోర్నమెంట్‌లో చివరిసారి ఫిబ్రవరి 9వ తేదీన మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. కెనడా జట్టు కేవలం 156 పరుగులకే పరిమితమైంది. దీంతో ఫైనల్ మ్యాచ్ కోసం ఉపయోగించే పిచ్ దాదాపు కొత్తదానిలా ఉండే అవకాశం ఉంది.

ఫైనల్‌పై భారీ అంచనాలు: 
అహ్మదాబాద్‌లోని ఈ చారిత్రాత్మక స్టేడియంలో జరిగే భారత్–న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్కంఠ రేపుతోంది. గత జ్ఞాపకాలను పక్కనబెట్టి ఈసారి ట్రోఫీని గెలుచుకోవాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది.