IND vs ENG 2025: 89 ఏళ్లలో విజయమే లేదు: ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో టీమిండియాకు ఘోరమైన రికార్డ్స్

IND vs ENG 2025: 89 ఏళ్లలో విజయమే లేదు: ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో టీమిండియాకు ఘోరమైన రికార్డ్స్

ఇంగ్లాండ్ తో కీలకమైన నాలుగో టెస్టులో ఇండియా ఎలాగైనా విజయం సాధించాల్సిన పరిస్థితి. 1-2తో సిరీస్ లో వెనకపడ్డ టీమిండియా సిరీస్ లో ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫర్డ్ లో జరగనున్న నాలుగో టెస్టులో ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఈ మ్యాచ్ డ్రా చేసుకున్నా టీమిండియా సిరీస్ గెలవలేదు. దీంతో బుధవారం (జూలై 23) ప్రారంభం కానున్న డూ ఆర్ డై టెస్టులో ఎలాగైనా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు టీమిండియాను ఓల్డ్ ట్రాఫర్డ్ రికార్డ్ భయపెడుతోంది.

89 ఏళ్లుగా ఈ గ్రౌండ్ లో ఒక్క విజయం లేకపోవడమే అందుకు కారణం. ఓల్డ్ ట్రాఫర్డ్ ప్రపంచంలోని పురాతన క్రికెట్ వేదికలలో ఒకటి. 1857లో స్థాపించబడిన ఈ స్టేడియం మొదటిసారిగా 1884లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ కు ఆతిధ్యమిచ్చింది. ఈ మ్యాచ్ డ్రా అయింది. టీమిండియా విషయానికి వస్తే గత 89 ఏళ్లలో భారత క్రికెట్ జట్టు ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. 1936లో ఓల్డ్ ట్రాఫర్డ్ లో తొలిసారి టీమిండియా టెస్ట్ ఆడింది. ఈ మ్యాచ్ ను డ్రా గా ముగించారు. 1946లో మరోసారి డ్రా చేసుకోగా.. 1952,1959లో వరుసగా రెండు టెస్టులు ఓడిపోయింది. 1971, 1982, 1990లో డ్రా..చేసుకున్న మన జట్టు..1974,2014లో ఓటమి పాలైంది.

ఈ వేదికపై మొత్తం 9 మ్యాచ్ లు ఆడిన టీమిండియా ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవకపోయినా, ఐదు డ్రాలు చేసుకుని, నాలుగు ఓడిపోయింది. వన్డేల్లో మొత్తం 12 మ్యాచ్ ల్లో 6 గెలిచి ఆరు ఓడిపోయింది. ఈ సిరీస్ లో భాగంగా ఎడ్జ్ బాస్టన్ టెస్టులో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే అంతకముందు ఈ గ్రౌండ్ లో ఒక్క విజయం లేదు. మరోసారి టీమిండియాకు ఇదే పరిస్థితి ఎదురైంది. మరి ఈ మ్యాచ్ లో గెలుస్తారో లేదో చూడాలి. మరోవైపు ఇంగ్లాండ్ కు ఓల్డ్ ట్రాఫోర్డ్ లో అద్భుతమైన రికార్డ్ ఉంది. మొత్తం 20 టెస్టుల్లో 14 మ్యాచ్ ల్లో గెలిచి రెండు ఓడిపోయింది. మరో నాలుగు మ్యాచ్ లను డ్రా చేసుకుంది.