శాండ్‌‌విచ్‌‌లో పురుగు.. సారీ చెప్పిన ఇండిగో ఎయిర్​లైన్స్​

శాండ్‌‌విచ్‌‌లో పురుగు..  సారీ చెప్పిన ఇండిగో ఎయిర్​లైన్స్​

న్యూఢిల్లీ : ఇండిగో విమానంలో ఓ మహిళా ప్యాసింజర్​కు అందించిన శాండ్‌‌విచ్‌‌లో పురుగు కనిపించింది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న 6ఈ 6107 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ అంశాన్ని ఆ మహిళ తన ఇన్‌‌స్టాగ్రామ్‌‌ అకౌంట్​లో షేర్ చేసింది. ‘‘శాండ్‌‌విచ్ మంచిగా లేదని ఫ్లైట్ అటెండెంట్‌‌కి చెప్పాను. అయినప్పటికీ ఇతర ప్రయాణికులకు శాండ్‌‌విచ్‌‌లను అందించారు. అక్కడ పిల్లలు, వృద్ధులు, ఇతర ప్రయాణికులు ఉన్నారు. 

ఎవరికైనా ఇన్ఫెక్షన్ సోకితే ఎలా? పబ్లిక్ హెల్త్ ప్రొఫెషనల్‌‌గా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను త్వరలో ఈమెయిల్ ద్వారా అధికారికంగా కంప్లైంట్ చేస్తాను..”అని ఆమె పోస్ట్​ చేశారు. తనకు ఎలాంటి పరిహారం గానీ, రీఫండ్ గానీ అవసరం లేదని, ప్రయాణికుల ఆరోగ్యం, భద్రత ప్రధాన బాధ్యతగా హామీ ఇస్తే చాలని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన ఇండిగో ఎయిర్​లైన్స్..​ ఓ ప్రకటనలో మహిళకు క్షమాపణలు చెప్పింది. ఈ విషయం ప్రస్తుతం దర్యాప్తులో ఉందని తెలిపింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా క్యాటరర్‌‌ తో మాట్లాడుతున్నామని, ప్రయాణికులకు ఎదురైన అసౌకర్యానికి  క్షమాపణలు కోరుతున్నామని ప్రకటించింది.