ఖమ్మం, వెలుగు: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ బీమా స్కీమ్ ప్రారంభిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని కోటీ 15 లక్షల కుటుంబాలకు బీమా కల్పిస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు చెప్పులరిగేలా తిరిగినా రూ.లక్ష సాయం కూడా దక్కలేదని విమర్శించారు.
ప్రమాదవశాత్తు కుటుంబ యజమానిని కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ఈ స్కీమ్తెచ్చిందన్నారు. ఖమ్మంలో ఆదివారం జరిగిన స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా అభినందన సభలో భట్టి మాట్లాడారు. సుడా, గ్రంథాలయ సంస్థల ద్వారా ప్రజలకు సేవలందించాలని సూచించారు.
వ్యాపారవేత్తలుగా మహిళలు
మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అందులో భాగంగానే మే 27న మధిర నియోజకవర్గంలోని రాజుపాలెంలో రాష్ట్రంలో మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్ల పథకాన్ని ప్రారంభించనున్నట్టు భట్టి తెలిపారు. మహిళా సంఘాలకు ఏటా రూ. 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని, ఆ మొత్తాన్ని రూ. లక్ష కోట్లకు పెంచుతామన్నారు.
మహిళలకు 550 ఆర్టీసీ బస్సులను కేటాయిస్తామని చెప్పారు. పేదలకు సన్నబియ్యాన్ని తమ ప్రభుత్వం మాత్రమే ఇస్తోందని, గృహజ్యోతి పథకం కింద 53 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. తమ ప్రభుత్వం 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని, జూన్ 2 నుంచి మరో 2 లక్షల ఇండ్లను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు.
స్కూళ్లలో ఉదయం బ్రేక్ ఫాస్ట్
ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు దేశంలోనే తొలిసారిగా ఉచిత బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు భట్టి తెలిపారు. జూనియర్ కాలేజీల్లో కూడా మిడ్ డే మీల్స్ స్కీమ్ ప్రారంభిస్తున్నామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని, వరి, మక్క రైతులు ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ పార్టీ జెండాను మోసిన కార్యకర్తలను నిర్లక్ష్యం చేయబోమన్నారు.
తమ పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ఆ కుట్రలను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నిబద్ధత, నిజాయితీతో పనిచేస్తే పార్టీ నాయకత్వం తప్పకుండా గుర్తిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పార్టీ కోసం ఎంతో కాలంగా కష్టపడుతున్న వారికి కీలకమైన సుడా, జిల్లా గ్రంథాలయ సంస్థ పదవులు దక్కాయని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యేలు డాక్టర్ మట్ట రాగమయి, రాందాస్ నాయక్, కూనంనేని సాంబశివరావు, ఎంపీ రఘురాంరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్తకళల సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ పాల్గొన్నారు.
