- వాసాలమర్రిలో ఆగవ్వతోపాటు అనేక కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినం
- హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ , వెలుగు: కేసీఆర్ అసమర్థ పాలన కారణంగా యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో సొంతింటి కలకు దూరమైన ఆగవ్వతో పాటు అర్హులైన అనేక కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు అందించామని హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ పనితీరుకు ఇదే నిదర్శనమని మంగళవారం ఒక పత్రికాప్రకటనలో తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో దత్తత పేరుతో, దావత్ పేరుతో ఆర్భాటపు ప్రచారాలు చేసుకున్న కేసీఆర్.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లే వాసాలమర్రి గ్రామ ప్రజలను కూడా మోసం చేశారని మంత్రి మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలోనే వాసాలమర్రిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి, ఇది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని నిరూపించామన్నారు. మంగళవారం “కేసీఆర్ దోస్త్ ఆగవ్వకు ఇందిరమ్మ ఇల్లు ” పేరుతో వెలుగులో దినపత్రికలో పబ్లిష్ అయిన కథనాన్ని మంత్రి పొంగులేటి తన ట్వీట్‌లో షేర్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తొలి దశలో 4.5 లక్షలు, రెండో దశలో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి శరవేగంగా నిర్మాణాలు కొనసాగిస్తున్నామని, హైదరాబాద్ పరిధిలో కూడా తొలి దశలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.
