అర్బన్ ఏరియా ల్లో ఇందిరమ్మ ఇండ్లు... వచ్చే నెల చివరి నాటికి లబ్ధిదారుల ఎంపిక

అర్బన్ ఏరియా ల్లో ఇందిరమ్మ ఇండ్లు... వచ్చే నెల చివరి నాటికి లబ్ధిదారుల ఎంపిక
  •    ఈ నెలాఖరుకు సొంత జాగా ఉన్న 28 వేల మందికి ఇండ్ల పత్రాలు
  •     అధికారులతో మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు, పొన్నం, అజారుద్దీన్ రివ్యూ

హైదరాబాద్, వెలుగు: హైద‌‌రాబాద్‌‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌‌ జిల్లాల క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ)ప‌‌రిధిలో  ఇందిర‌‌మ్మ ఇండ్ల నిర్మాణం స్టార్ట్ చేస్తున్నట్టు హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు వచ్చే నెల చివ‌‌రినాటికి ల‌‌బ్ధిదారుల ఎంపిక ప్రక్రియ‌‌ను పూర్తిచేస్తామ‌‌ని చెప్పారు. మూడు మున్సిప‌‌ల్ కార్పొరేష‌‌న్ల ప‌‌రిధిలో సొంత ఇండ్ల స్థలాలు ఉన్న 28వేల మంది ల‌‌బ్ధిదారుల‌‌కు ఈ నెల చివ‌‌రిలోగా ఇందిర‌‌మ్మ ఇండ్ల మంజూరు ప‌‌త్రాల‌‌ను అంద‌‌జేయాల‌‌ని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. 

అర్బన్ ఏరియాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై మంగళవారం సెక్రటేరియెట్​లో​ రంగారెడ్డి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ తో మంత్రి పొంగులేటి సమావేశమయ్యారు.

మురికివాడ‌‌ల్లో ఇందిర‌‌మ్మ మోడ‌‌ల్ టవర్లు,  ఇందిర‌‌మ్మ ఇండ్ల నిర్మాణానికి స్థలాల సేక‌‌ర‌‌ణ‌‌, అసంపూర్తిగా ఉన్న డ‌‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి, పూర్తయిన ఇండ్ల  కేటాయింపు త‌‌దిత‌‌ర అంశాల‌‌పై హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ కార్యద‌‌ర్శి వీపీ గౌత‌‌మ్‌‌, హైద‌‌రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మ‌‌ల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల క‌‌లెక్టర్లు, జీహెచ్ ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి కార్పొరేషన్ల కమిషనర్లు ఈ రివ్యూకు అటెండ్ అయ్యారు.  

ప‌‌ట్టణాల్లోని మురికివాడ‌‌ల్లో జీవ‌‌నం కొన‌‌సాగిస్తున్న పేద‌‌లు అక్కడే ఉండ‌‌డానికి ఇష్టపడుతున్నార‌‌ని అధికారులు మంత్రులకు వివరించారు. ముఖ్యంగా హైద‌‌రాబాద్ సిటీకి దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే త‌‌మ జీవ‌‌నోపాధికి ఇబ్బంది క‌‌లుగుతుంద‌‌న్న ఉద్దేశంతో ఇండ్లు తీసుకోవ‌‌డానికి ఆస‌‌క్తి చూప‌‌డం లేద‌‌ని, హైద‌‌రాబాద్‌‌కు దూరంగా గ‌‌తంలో 42వేల ఇండ్లను నిర్మించ‌‌గా అందులో స‌‌గం మంది మాత్రమే అక్కడ నివ‌‌సిస్తున్నార‌‌ని అధికారులు పేర్కొన్నారు.  

ఇటీవ‌‌ల నిర్వహించిన క్షేత్రస్థాయి స‌‌ర్వేలో ఈ అంశాలు తెలిశాయని స‌‌మావేశంలో అధికారులు మంత్రుల దృష్టికి తీసుకువ‌‌చ్చారు. అలాగే, చాలాచోట్లా బోగ‌‌స్ ల‌‌బ్ధిదారులు కూడా ఉన్నార‌‌ని అధికారులు మంత్రుల‌‌కు వివ‌‌రించారు. ఈ అంశాల‌‌న్నింటినీ ప‌‌రిగ‌‌ణ‌‌న‌‌లోకి తీసుకొని.. నిరుపేద‌‌ల జీవ‌‌నోపాధికి ఇబ్బంది లేకుండా.. స్థానిక ప‌‌రిస్థితుల‌‌ను బ‌‌ట్టి 5 నుంచి 10 అంత‌‌స్తుల ఇందిర‌‌మ్మ టవర్లను  నిర్మించాల‌‌నే ఆలోచ‌‌న చేస్తున్నామ‌‌ని, వ‌‌చ్చే కేబినెట్ స‌‌మావేశంలో చ‌‌ర్చించి తుది నిర్ణయం తీసుకుంటామ‌‌ని  మంత్రి పొంగులేటి వెల్లడించారు. 

పది రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలి

ముగ్గురు మున్సిప‌‌ల్ కార్పొరేష‌‌న్ల క‌‌మిష‌‌న‌‌ర్లు, 4 జిల్లాల క‌‌లెక్టర్లు స‌‌మ‌‌న్వయంతో వారి వారి ప్రాంతాల్లో స్థలాల‌‌ను గుర్తించి ఎన్ని ఇండ్లు నిర్మించ‌‌వ‌‌చ్చు? ఎంత‌‌మంది ల‌‌బ్ధిదారులు ఉన్నారు? వంటి వివ‌‌రాల‌‌తో ప‌‌దిరోజుల్లో నివేదిక అంద‌‌జేయాల‌‌ని  మంత్రులు ఆదేశించారు. మురికివాడ‌‌ల్లో స్థలం ఉన్నవారు అంగీక‌‌రిస్తే ఆ ప్రాంతంలో జీప్లస్ 5 వ‌‌ర‌‌కు ఇందిర‌‌మ్మ టవర్లను  నిర్మించి అభివృద్ధి చేయాల‌‌న్న ఆలోచ‌‌న చేస్తున్నామ‌‌ని, జేఎన్ఎన్‌‌యూ ఆర్ ఎం ప‌‌థకంలో నిర్మించిన ఇండ్లు శిథిలావ‌‌స్థకు చేరాయ‌‌ని వాటి స్థానంలో కూడా ఇందిర‌‌మ్మ ఇండ్లు నిర్మించే ఆలోచ‌‌న చేస్తున్నామ‌‌ని మంత్రి పొంగులేటి తెలిపారు.  

ట్రిపుల్​ఆర్, - ఓ ఆర్ ఆర్ ప‌‌రిధిలో మ‌‌ధ్యత‌‌ర‌‌గ‌‌తి ప్రజ‌‌ల కోసం గ‌‌తంలో కేబీహెచ్‌‌బీలో నిర్మించిన మాదిరిగానే ఇండ్లను నిర్మిస్తామ‌‌ని, ఇందుకు నాలుగు ప్రాంతాల్లో స్థలాల‌‌ను గుర్తించి ప‌‌ది రోజుల్లో నివేదిక ఇవ్వాల‌‌ని అధికారుల‌‌ను మంత్రులు ఆదేశించారు.

అసంపూర్తి ఇండ్లకు నిధులు

అసంపూర్తిగా ఉన్న, ఇప్పటికే పూర్తయిన‌‌ డ‌‌బుల్ బెడ్రూం ఇండ్లకు మార్చి చివ‌‌రినాటికి ల‌‌బ్ధిదారుల‌‌ను ఎంపిక చేయాల‌‌ని ఆయా జిల్లా క‌‌లెక్టర్లను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇండ్లకు ల‌‌బ్ధిదారుల‌‌ను గుర్తించి.. ఆ ల‌‌బ్ధిదారులే ఆ ఇండ్లను పూర్తి చేసుకోవ‌‌డానికి అంత‌‌కుముందు ఖ‌‌ర్చుచేసిన మొత్తాన్ని ప‌‌రిగ‌‌ణ‌‌న‌‌లోకి తీసుకొని మిగిలిన నిధుల‌‌ను హౌసింగ్ కార్పొరేష‌‌న్ మంజూరు చేస్తుంద‌‌ని మంత్రి పొంగులేటి తెలిపారు. 

చాలా చోట్ల ఇండ్లు తీసుకొని అక్కడ నివాసం లేని వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాల‌‌ని.. అలాగే, బోగ‌‌స్ ల‌‌బ్ధిదారుల‌‌ను గుర్తించాల‌‌ని అధికారుల‌‌కు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. అన‌‌ర్హుల స్థానంలో రాజ‌‌కీయాల‌‌కు అతీతంగా స‌‌మీపంలో ఉన్నఅర్హులైన పేద‌‌ల‌‌ను ఎంపిక చేయాల‌‌ని కలెక్టర్లకు సూచించారు. 2 బీహెచ్‌‌కే నివాస ప్రాంతాల‌‌లోని ప్రతి ఇంటికి తాగునీరు, విద్యుత్, డ్రైనేజ్‌‌  వంటి క‌‌నీస వ‌‌స‌‌తులు  క‌‌ల్పించాల‌‌ని అధికారుల‌‌ను మంత్రులు ఆదేశించారు.