- నాలుగు నియోజకవర్గాల్లో ఈ నెల 20 వరకు అవకాశం
- వరుస సెలవులు, పండుగల నేపథ్యంలో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: క్యూర్ పరిధిలో ప్రభుత్వం నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌లో ఇండ్ల కోసం దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ తెలిపారు. వినాయక చవితి, వీకెండ్ సెలవుల నేపథ్యంలో గడువు పెంచాలని వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దరఖాస్తులు స్వీకరించి, లాటరీ ద్వారా ఇండ్ల కేటాయింపు పూర్తి చేశామన్నారు.
ప్రస్తుతం చాంద్రాయణగుట్ట,
ఎల్‌బీనగర్, ముషీరాబాద్, గోషామహల్ నియోజకవర్గాల్లో నిర్మించనున్న టవర్లలో ఇండ్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అర్హత ప్రమాణాలు, ఇతర నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. వివరాలకు హౌసింగ్ బోర్డు వెబ్‌సైట్‌ను సందర్శించాలని లేదా కాల్ సెంటర్ నంబర్ 040-24603572ను సంప్రదించాలని సూచించారు.
