విమానం నడుపుతూ నిద్రపోయిన పైలెట్లు.. రాంగ్ రూట్‌లో అరగంట ప్రయాణం

విమానం నడుపుతూ నిద్రపోయిన పైలెట్లు.. రాంగ్ రూట్‌లో అరగంట ప్రయాణం

విమాన ప్రయాణం ఎంత మంచి అనుభూతినిస్తుందో కదా..! గాలిలో అలా అలా మబ్బుల చాటున తేలియాడుతూ ప్రయాణిస్తుంటే వచ్చే ఆ మజానే వేరు. మీలోనూ కొందరు ఆ అనుభూతిని ఆస్వాదించే ఉంటారు. మరికొందరు అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. విమానం ఎక్కితే వచ్చే ఆ ఆనందం సంగతి దేవుడెరుగు కానీ, కాసింత అయ్యుంటే 153 మంది ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. విమానం గాల్లో ఉండగా.. పైలట్లు ఇద్దరూ అరగంట పాటు కునుకు తీశారు. ఈ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. 

ఏం జరిగిందంటే..?

బాతిక్ ఎయిర్వేస్ సంస్థకు చెందిన బాటిక్ ఎయిర్-బిటికె 6723 అనే విమానం నలుగురు సిబ్బంది, 153 మంది ప్రయాణికులతో సులవేసి నుంచి దేశ రాజధాని జకార్తాకు బయలుదేరింది. మార్గమధ్యలోకి వెళ్లగానే పైలట్లు ఇద్దరికి నిద్రొచ్చింది. చేసేదేం లేక ఓ అరగంట పాటు ప్రశాంతంగా కునుకు తీశారు. ఇంకేముంది, విమానం మరో దారి చూసుకుంది.     

దాదాపు 28 నిమిషాల తర్వాత మేల్కొన్న ప్రధాన పైలట్.. తన కో పైలట్ కూడా నిద్ర పోతున్నట్లు గమనించాడు. తీరా చూస్తే విమానం నిర్ణీత మార్గంలో కాకుండా మరో దారిలో వెళ్తోంది. వెంటనే కో పైలట్‌ను నిద్ర లేపి ఎయిర్ కంట్రోల్ కాల్ సెంటర్‌ను సంప్రదించి విమానాన్ని సరైన మార్గంలోకి తీసుకొచ్చాడు. అనంతరం విమానాన్ని సురక్షితంగా  జకార్తాలో ల్యాండ్ చేశారు. ఈ ఘటన ఈ ఏడాది జనవరి 25న జరగ్గా.. ఇండోనేషియా ఎయిర్ లైన్స్ అధికారులు రహస్యంగా ఉంచారు. అందుకు కారణమైన ఇద్దరు పైలట్లపై సస్పెన్షన్ వేటు వేసి, విచారణకు ఆదేశించారు. బహుశా..! పైలట్లిద్దరూ ఎలాన్ మాస్క్ కార్లలా డ్రైవర్ అవసరం లేని అనుకున్నారో ఏమో..!