అలర్ట్.. HT పత్తి విత్తనాలు అమ్మొద్దు..కొనొద్దు

అలర్ట్.. HT పత్తి విత్తనాలు అమ్మొద్దు..కొనొద్దు

కేంద్ర ప్రభుత్వం అనుమతిలేని HT (Herbicide Tolerant) పత్తి విత్తనాలను రాష్ట్రంలోకి రాకుండా చర్యలు  తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అధికారులను ఆదేశించారు. సరిహద్దులో  టాస్క్ ఫోర్స్ టీమ్ లు ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు.

రాష్ట్రంలో అనధికారకంగా, అనుమతిలేని పత్తి విత్తనాల ప్యాకెట్ల అమ్మకాలను అరికట్టాలని మంత్రి తుమ్మల అన్నారు. పత్తి విత్తనాల ప్యాకేట్లపై వ్యవసాయశాఖ సంచాలకులతో సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతిలేని HT పత్తి విత్తనాలను రాష్ట్రంలో అమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. HT/BG-III పత్తి రకాన్ని అమెరికాకు చెందిన మోన్సాంటో కంపెనీ కనుగొన్నప్పటికి, ఫీల్డ్ ట్రయల్స్ లో ఫెయిల్ అవడం, దీనివలన పర్యావరణానికి కలిగే అనర్థాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ పత్తి రకానికి అనుమతులు ఇవ్వలేదని మంత్రి తెలిపారు.
    
అయినప్పటికి కొందరు దళారులు తమ ప్రయోజనాల కోసం రైతులకు HT పత్తి విత్తనాలను అనధికారకంగా రైతులకు అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 20 అధీకృత పత్తి విత్తన కంపెనీలు విత్తనోత్పత్తి చేస్తుండగా, ప్రభుత్వం సర్టిఫైడ్ చేసిన మరో 40 వివిధ కంపెనీలు రాష్ట్రానికి పత్తి విత్తన ప్యాకెట్లను సరఫరా చేస్తున్నాయన్నారు. గత సంవత్సరం ఈ కంపెనీల ద్వారా సరఫరా అయిన 1.10 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లను రైతుల కొనుగోలు చేశారన్నారు. కొందరు దళారులు కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన HT విత్తనాలతో పాటు కల్తీ విత్తనాలను మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలోని రైతులకు అమ్ముతున్నట్టు గుర్తించామని మంత్రి తెలిపారు. 
    
రాష్ట్రంలో దాదాపు 52 లక్షల ఎకరాలలో పత్తి సాగయ్యే అవకాశం ఉందని, దీనిని ఆసరా చేసుకొని దళారులు HT విత్తనాలు,కల్తీ విత్తనాలను రాష్ట్రంలోకి తెచ్చే అవకాశం ఉన్నందున, ఈ నెల నుంచే సరిహద్దు ప్రాంతాలలో టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసిన పత్తి విత్తనాల అక్రమ రవాణాలను అరికట్టే విధంగా నిఘా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా కో-మార్కెటింగ్ కు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 

HT పత్తి విత్తనాలను రైతులు కొనకుండా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా కలుపును తట్టుకుంటుందని, అధిక దిగుబడి వస్తుందని HT పత్తి విత్తనాలను కొనవద్దని ఈ సందర్భంగా మంత్రిగారు రైతులను కోరారు. ఈ విత్తనాలను వాడటం వలన అధికంగా కలుపు మందు వాడాల్సి వస్తుందని, దీంతో పర్యావరణానికి హాని కలగడంతోపాటు జీవ వైవిధ్యం దెబ్బతిని, ఇతర పత్తి హైబ్రిడ్ లు కూడా కలుషితం అవుతాయని వివరించారు.