కేసులు పెడుతున్నా..వెనక్కి తగ్గట్లే

కేసులు పెడుతున్నా..వెనక్కి తగ్గట్లే
  • ఏడుగురిపై కేసులు పెట్టిన పోలీసులు
  • అయినా అదే పోరాటం  
  • ప్రాజెక్టు ప్రారంభించాలని టీఆర్ఎస్  ఆధ్వర్యలో రైతుల ఎదురుదీక్ష
  • కొనసాగుతున్న గుడాటిపల్లి నిర్వాసితుల దీక్షలు

సిద్దిపేట, వెలుగు :  గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు గ్రామమైన సిద్దిపేట జిల్లా గుడాటిపల్లి నిర్వాసితులు వెనక్కి తగ్గడం లేదు. తమ సమస్యలు పరిష్కరించేంతవరకు దీక్షలు కొనసాగిస్తామంటున్నారు. మంత్రి హరీశ్​రావుతో జరిగిన చర్చల్లో పురోగతి లేకపోవడంతో నిరశనను కంటిన్యూ చేస్తున్నారు. మరోవైపు నాలుగు రోజుల కిందట హుస్నాబాద్​లో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వద్ద జరిగిన ఘర్షణలో బాధ్యులను చేస్తూ పోలీసులు పలువురు నిర్వాసితులను అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే ఏడుగురిపై కేసులు పెట్టగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారని చెబుతున్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని, అన్నింటికీ తెగించే పోరాటం చేస్తున్నామని, న్యాయం జరిగేంతవరకు ఉద్యమం ఆపబోమని నిర్వాసితులు అంటున్నారు.  

ట్రయల్​ రన్​కు ఎందుకంత తొందర? 
మూడేండ్ల కింద పంపింగ్ కోసం చైనా నుంచి తెప్పించిన మోటార్లను ఈ నెలాఖరులోగానే పరీక్షించాల్సి ఉంది. ఒకవేళ అవి పని చేయకపోతే అగ్రిమెంట్ ప్రకారం సరఫరా చేసిన కంపెనీయే రిపేర్లు చేస్తుంది. గడువు తీరిన తరువాత పనిచేయకపోతే వారి బాధ్యత ఉండదు. దీంతో సర్కారు రూ.కోట్లలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకనే ట్రయల్ రన్ నిర్వహించాలని పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. 

చర్చల్లో బెడిసికొట్టిందెక్కడ? 
గౌరవెల్లి ప్రాజెక్టుతో ముంపుకు గురైన నిర్వాసితులంతా నివాసానికి అనువైన ప్రాంతంలో కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆ  ఉద్దేశంతోనే వారు కోరుకున్న ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని అడుగుతున్నారు. మంత్రి హరీశ్​రావుతో జరిగిన చర్చల్లో కూడా ఈ అంశాన్ని ప్రతిపాదించారు. కానీ సర్కారు రామవరం (గుట్టల ప్రాంతం) వద్ద ఉన్న ప్రభుత్వ స్థలంలో ప్లాట్లు ఇస్తామని చెప్పడంతో నిర్వాసితులు ఒప్పుకోలేదు. 18 ఏండ్లు నిండిన వారికి ఆర్అండ్ఆర్ ​ప్యాకేజీ వర్తింపజేయాలని కూడా కోరగా, ప్రభుత్వం మాత్రం 200 గజాల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెబుతోంది. ఒకవేళ ఇల్లు వద్దనుకుంటే రూ.3 లక్షలు ఇస్తామని స్పష్టం చేసింది. దీనిపై కూడా నిర్వాసితులు వెనక్కి తగ్గడం లేదు.  ‘గుడాటిపల్లి’ నిర్వాసితులు అడిగినట్టు18 ఏండ్లు నిండినవారికి ఆర్అండ్ఆర్​ ప్యాకేజీ వర్తింపజేస్తే మిగతా చోట్ల కూడా ఇదే రిపీట్​అవుతుందని, అందుకే ఒప్పుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇక మిగిలిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా, ఇన్ని రోజులు పెండింగ్​లో ఎందుకు పెట్టారని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. ట్రయల్​రన్​ఉన్నందునే ఈ మాటలు చెబుతున్నారని, ఇప్పుడు తాము ఒప్పకుంటే తర్వాత తమకు అన్యాయం చేస్తారని అంటున్నారు. ముందు సమస్యలు పరిష్కరించిన తర్వాతే ట్రయల్​రన్ ​చేసుకోవాలంటున్నారు.

వినకపోవడంతో కేసులు  
హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నాలుగు రోజుల కింద జరిగిన ఘర్షణలో నిర్వాసితులపైనే  పోలీసులు కేసు నమోదు చేశారు.  అప్పుడు జరిగిన గొడవలో ఏసీపీ, ఎస్ఐ గాయపడ్డారని ఏడుగురు నిర్వాసితులపై పోలీసులు కేసులు పెట్టారు. ఇందులో ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారని చెబుతున్నారు. దీనిపై నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే తమపై లాఠీచార్జి చేసి తామే దాడి చేసినట్టు కేసులు పెట్టడం దుర్మార్గమంటున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలు ఒప్పుకోనందుకే తమపై కక్ష కట్టి కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి నిర్బంధాలతో తమ పోరాటాన్ని అడ్డుకోలేరంటున్నారు. 

టీఆర్ఎస్​ ఆధ్వర్యంలో రైతుల దీక్షలు
గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నిర్వాసితుల దీక్షకు పోటీగా అక్కన్నపేటలో టీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో రైతులు శుక్రవారం రిలే దీక్షలు మొదలుపెట్టారు. ప్రాజెక్టును ప్రారంభిస్తే హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సాగునీరందుతుందని, పది శాతం మంది నిర్వాసితుల కోసం ప్రాజెక్ట్ ను ఆపవద్దని దీక్షలు చేస్తున్న వారు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు భూనిర్వాసితులను రెచ్చగొడుతూ పనులను అడ్డుకుంటున్నాయన్నారు. ప్రాజెక్ట్ ను ప్రారంభించేంతవరకు దీక్ష కొనసాగిస్తామన్నారు. 

దీక్షలు కొనసాగిస్తాం 


 మంత్రి హరీశ్​ రావుతో చర్చల సందర్భంగా ప్రభుత్వ ప్రతిపాదనలను నిర్వాసితులు తిరస్కరించారు. అన్ని పరిహారాలు ఇస్తామని చెబుతున్నా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. 18 ఏండ్లు నిండిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరుతుండగా ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. గతంలో ఎమ్మెల్యే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చినందునే తాము సూచించిన స్థలంలో ఇవ్వాలని కోరుతున్నాం. ఇతర పనుల కోసం ప్రైవేటు స్థలాలను తీసుకుంటున్న సర్కారు..నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడానికి ఎందుకు తీసుకోదు. అందుకే డిమాండ్ల సాధనకు దీక్షలు కొనసాగించాలని నిర్ణయించాం. – ఎం.రాజిరెడ్డి, సర్పంచ్, గుడాటిపల్లి

మంత్రి ప్రతిపాదనలతో సంతృప్తిగా లేం


గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులతో ప్రభుత్వం మానవతా థృక్ఫథంతో వ్యవహరించాలి. మంత్రి ప్రతిపాదనలతో నిర్వాసితులు ఏ మాత్రం సంతృప్తిగా లేరు. దాదాపు 90 శాతం పనులు పూర్తయినా డిమాండ్లు  నెరవేర్చడంలో చొరవ చూపడం లేదు. నిర్వాసితులతో మరొకసారి ప్రభుత్వం చర్చలకు రావాలి.  – ఎ.తిరుపతిరెడ్డి,  గుడాటిపల్లి నిర్వాసితుడు