ఇంకా మిస్టరీగానే ఇంజక్షన్​ మర్డర్ ఇష్యూ

ఇంకా మిస్టరీగానే  ఇంజక్షన్​ మర్డర్ ఇష్యూ
  • మిస్టరీగానే ఇంజక్షన్ మర్డర్
  • పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు? 
  • వివాహేతర సంబంధం నేపథ్యంలోనే  హత్య ?  
  • సిరంజీలోని మందు శాంపిల్ ఫోరెన్సిక్ ల్యాబ్​కు.. 

ఖమ్మం/ ముదిగొండ, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజక్షన్​ మర్డర్ ఇష్యూ ఇంకా మిస్టరీగానే ఉంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని బాణాపురం, వల్లభి గ్రామాల మధ్య సోమవారం జరిగిన ఈ హత్యకు కారణాలు తెలుసుకోవడానికి పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నామని చెబుతుండగా, వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ మర్డర్​ జరిగినట్టు ప్రచారం సాగుతోంది. మృతుడు జమాల్​ సాహెబ్​(48) కుటుంబసభ్యులు తమకు ఎవరిపై అనుమానాలు లేవని చెప్పారు. దీంతో ఖమ్మం రూరల్​ ఏసీపీ బస్వారెడ్డి, సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వల్లభి పెట్రోల్​బంక్​ లో ఉదయం 9.27 నుంచి 9.40 గంటల వరకు ఉన్న సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో కొందరు అనుమానితులను గుర్తించినట్టు సమాచారం.  

మూడు నిమిషాల్లోపే మర్డర్ ​

సోమవారం ఉదయం 9 గంటలకు చింతకాని మండలం బొప్పారం నుంచి టూ వీలర్​పై ఏపీలోని తన కుమార్తె ఇంటికి జమాల్ బయల్దేరాడు. బాణాపురం దాటిన తర్వాత నిందితుడు లిఫ్ట్ అడగడంతో ఎక్కించుకున్నాడు. రెండు కిలోమీటర్ల దూరం వెళ్లేలోపే బైక్​పై ఎక్కించుకున్న వ్యక్తి తనకేదో గుచ్చాడంటూ రోడ్డు పక్కన పనిచేసుకుంటున్న కూలీలకు చెప్పి పడిపోయాడు. దీంతో ఆ మూడు నిమిషాల్లోనే ముందుగా సిద్ధం చేసుకొని ఉన్న ఇంజక్షన్​ఇచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇంజక్షన్​లో వాడిన మందు కుక్కలను చంపేందుకు ఉపయోగించే మెడిసిన్​ గా ప్రచారం జరిగినా, ఆపరేషన్ల టైంలో ఉపయోగించే అనస్తీషియా మందు ఎక్కువ డోస్​లో ఇచ్చి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిచ్చిన ఇంజక్షన్​ రక్తంలో నేరుగా కలిస్తే నాలుగు నిమిషాల్లో, కండరాల్లోకి ఎక్కిస్తే 15 నిమిషాల్లో బిగుసుకుపోయి ఊపిరి ఆడక మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. దీన్ని బట్టి మెడిసిన్​పై అవగాహన ఉన్న వ్యక్తి ఈ దారుణం చేసి ఉండొచ్చన్న అభిప్రాయానికి పోలీసులు వచ్చారు. అయితే ఇంజక్షన్​ లో ఉన్న మెడిసిన్​ ఏమిటో తెలుసుకునేందుకు శాంపిల్ ను ఫోరెన్సిక్​ ల్యాబ్​ కు పంపించినట్టు చెబుతున్నారు. రెండు వారాల్లో రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

ప్లాన్​ ప్రకారమే హత్య 

జమాల్ సాహెబ్​ బండిపై ఎక్కడానికి ముందు నిందితుడు మరో వ్యక్తిని కూడా లిఫ్ట్ అడిగాడని, అతను బండి ఆపాక ఎక్కకుండా పంపించివేశాడని స్థానికులు చెబుతున్నారు. అంటే, జమాల్ సాహెబ్ ను లక్ష్యంగా చేసుకునే, ప్లాన్​ ప్రకారమే అక్కడ వేచి ఉన్నాడనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇంజక్షన్​ గుచ్చిన వెంటనే నిందితుడు అప్పటికే మరో బండిపై ఫాలో అవుతున్న వ్యక్తితో కలిసి వెళ్లినట్టు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. మరోవైపు నిందితుడు మంకీ క్యాప్​ పెట్టుకొని ఉన్నాడని ముందుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్​ రాగా, ఎంక్వైరీలో మాత్రం మాస్క్​ పెట్టుకొని, రెడ్​ షర్ట్ వేసుకొని ఉన్నాడని తేలింది. 5.5 అడుగుల ఎత్తుతో 28 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు ఉండొచ్చని కొందరు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు చెప్పారు.  

ఆర్​ఎంపీ సలహా తీసుకుని హత్య ?  

ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. చింతకాని మండలం మత్కేపల్లి నామవరానికి చెందిన ఆటో డ్రైవర్​ మోహన్​రావుతో పాటు మరో ఇద్దరిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. మృతుడు జమాల్ సాహెబ్ ​సుతారి మేస్త్రీగా పనిచేస్తుండగా, ఆయన భార్య కూడా సుతారే. మోహన్​ రావుతో మృతుడి భార్యకు వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో గతంలో ఒకట్రెండు సార్లు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయని గ్రామస్తులు చెబుతున్నారు. మోహన్​ రావు, జమాల్ సాహెబ్​ మధ్య కూడా ఇటీవల గొడవ జరిగిందని, దీంతో జమాల్ సాహెబ్​ ను చంపాలని మోహన్​ రావు భావించాడని అనుకుంటున్నారు. నామవరంలో ఆర్ఎంపీగా పనిచేస్తున్న గోద వెంకటేశ్​ దగ్గర సలహాలు తీసుకొని, మోహన్​రావు, అతడి ఫ్రెండ్ నరిశెట్టి వెంకటేశ్​తో కలిసి ఈ మర్డర్​ చేసినట్టు ప్రచారం సాగుతోంది. కానీ పోలీసులు మాత్రం ఈ విషయాన్ని నిర్ధారించడం లేదు. మూడు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని చెబుతున్నారు.