పంజాగుట్ట, వెలుగు : వెలుగుమట్ల వినోభా కాలనీలో కూల్చిన చోటే ఇండ్లు నిర్మించి బాధితులకు అప్పగించాలని, బాధితులపై పెట్టిన కేసులను ఎత్తివేసి, వారిని విడుదల చేయాలని పలువురు డిమాండ్ చేశారు. ‘వెలుగుమట్ల భూ బాధితుల పోరుపై సత్యాలు, అసత్యాలు, అర్ధసత్యాలు’ అనే అంశంపై తెలంగాణ సమాఖ్య కన్వీనర్ కరుణాకర్ దేశాయి ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో పత్రికా గోష్ఠి నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, సినీ దర్శకులు మహ్మద్ రఫి, భారత్ చైనా మిత్రమండలి కార్యదర్శి ఎం. మోహన్‌రెడ్డి, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ అధ్యక్షుడు జతిన్‌కుమార్, కార్యదర్శి విజయేందర్‌రావు, క్రాంతిదళ్ అధ్యక్షుడు పృధ్వీరాజ్, ప్రముఖ కవయిత్రి దాసోజు లలిత, మాల మహానాడు నాయకులు పబ్బతి శ్రీకృష్ణ, తొలి వెలుగు రఘు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... ఎవరి ప్రయోజనం కోసం పేదల ఇండ్లు కూల్చారో ఆలోచించుకోవాలని సూచించారు. పదేండ్లుగా ఉంటున్న వారి ఇండ్లను కూల్చడం సరికాదన్నారు. బాధితులకు ఇండ్లు మంజూరు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చట్ట వ్యతిరేక చర్యలకు బాధ్యులైన మంత్రులు, అధికారులను తక్షణమే బర్తరఫ్ చేయాలన్నారు. ఆందోళన తీవ్ర రూపం దాల్చకముందే 62.7 ఎకరాల స్థలంలో 1,899 మంది లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు.
