ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో రిజర్వ్‌‌డ్‌‌కు అన్యాయం

ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో రిజర్వ్‌‌డ్‌‌కు అన్యాయం

స్లైడింగ్‌లో మిగిలిన సీట్లను రెండో విడత కౌన్సిలింగ్‌లో కలిపేశారు

ముందు రిజర్వ్​డ్​ సీట్లు, ఆ తర్వాత ఓపెన్​ కేటగిరీ సీట్ల భర్తీకి సర్కార్​ ఏర్పాట్లు

ముందే ఓపెన్​ కేటగిరీ సీట్లు భర్తీ చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంబీబీఎస్‌‌  సీట్ల భర్తీలో రిజర్వ్​డ్​ స్టూడెంట్లకు తీవ్ర అన్యాయం జరిగే పరిస్థతి ఏర్పడింది. ప్రభుత్వ జీవోల్లోని లొసుగుల ఫలితంగా  వందల మంది నష్టపోతున్నారు. ఎంబీబీఎస్​ సీట్ల కౌన్సెలింగ్​ తీరుపై స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్​ ఫేజ్​ కౌన్సెలింగ్​లోని  స్లైడింగ్​లో మిగిలిన సీట్లను భర్తీ చేశాకే  సెకండ్​ ఫేజ్​ కౌన్సెలింగ్​ చేపట్టాలి. కానీ, నేరుగా సెకండ్​ ఫేజ్​​ కౌన్సెలింగ్​కు ఆఫీసర్లు నోటిఫికేషన్​ ఇచ్చారు. పైగా ముందు రిజర్వేషన్ సీట్లను భర్తీ చేస్తామని, ఆ తర్వాతే ఓపెన్​ సీట్లను భర్తీ చేస్తామని చెప్తున్నారు. దీనిపై స్టూడెంట్​ యూనియన్స్​, బీసీ, ఎస్సీ, ఎస్టీ  సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

స్లైడింగ్​లో మిగిలిన సీట్లు 300కుపైగానే..!

ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లోని తొలి విడత కన్వీనర్ కోటా సీట్ల కౌన్సిలింగ్ పూర్తయింది. తొలి విడతలో ఓపెన్ కేటగిరీ సీట్లు పొందిన సుమారు 300 మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్లు ఇతర కాలేజీల్లోని రిజర్వ్‌‌డ్‌‌ సీట్లలోకి స్లైడ్ అయ్యారు. నిబంధనల ప్రకారం.. ఓపెన్​ కేటగిరీలో స్టూడెంట్లు వదిలేసుకున్న  300కుపైగా  సీట్లు రిజర్వ్‌‌డ్ సీట్లుగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో అయితే ఇలాంటి సీట్లను రిజర్వ్‌‌డ్‌‌ స్టూడెంట్లతో భర్తీ చేసిన తర్వాతనే  రెండో విడత  ఓపెన్​ కోటా కౌన్సెలింగ్​ నిర్వహిస్తుంటారు. దీంతో  ఈ సీట్లు పొందిన స్టూడెంట్లు.. తర్వాత దశ కౌన్సెలింగ్​లోనూ పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. వీరిలో మెరుగైన ర్యాంక్ ఉన్న కొంత మందికైనా తర్వాత దశలో ఓపెన్ కేటగిరీ సీటు లభించే అవకాశం ఉంటుంది. వీళ్లు ఓపెన్ కేటగిరీ సీటు తీసుకుంటే, తర్వాత ర్యాంక్‌‌లో ఉన్న రిజర్వ్‌‌డ్ క్యాండిడేట్‌‌కు రిజర్వ్‌‌డ్‌‌  కేటగిరీలో ప్రయార్టీ ఉంటుంది. కానీ, మన దగ్గర మాత్రం రెండో విడత కౌన్సెలింగ్‌‌లోనే స్లైడింగ్‌‌ సీట్లను కలిపేసి భర్తీ చేస్తున్నారు. పైగా రిజర్వ్​డ్​ సీట్లను ముందుగా భర్తీ చేస్తున్నారు. దీంతో ఓపెన్ కేటగిరీలో సీటు వచ్చేందుకు అవసరమైన మెరిట్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్లు కూడా రిజర్వ్‌‌డ్‌‌ కేటగిరీ సీట్లకే పరిమితమవుతున్నారు. గత ఏడాది 262 మంది రిజర్వ్‌‌డ్‌‌  స్టూడెంట్లు ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయారు. దీనిపై అప్పట్లోనే స్టూడెంట్లు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. కౌన్సెలింగ్‌‌కు ఎంసీఐ విధించిన గడువు తక్కువగా ఉందని, ఈ దశలో జోక్యం చేసుకోలేమని అప్పట్లో కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఈసారైనా కౌన్సిలింగ్ ప్రక్రియ సాజావుగా జరపాలని, రిజర్వ్‌‌డ్  స్టూడెంట్లకు అన్యాయం చేయొద్దని పలు సంఘాల నాయకులు ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌ను ఆశ్రయించారు. ఆయన కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్‌‌‌‌రెడ్డి, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, లా సెక్రటరీ సంతోష్‌‌రెడ్డి తదితరులతో సమావేశం నిర్వహించారు.

ఓపెన్​ సీట్లు ముందుగా భర్తీ చేస్తే సమస్య లేదు

గత ఏడాది తరహాలోనే ఇప్పుడు కూడా రిజర్వ్‌‌డ్ స్టూడెంట్లకు అన్యాయం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తొలి దశలో భర్తీ కాని సీట్లు, స్టూడెంట్లు చేరని సీట్లు, నేషనల్ పూల్‌‌ నుంచి వెనక్కి వచ్చిన సీట్లను భర్తీ చేసేందుకు రెండో విడత కన్వీనర్ కోటా నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులోనే స్లైడింగ్‌‌లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఇలా చేసినా తొలుత ఓపెన్ కేటగిరీ సీట్లు, ఆ తర్వాత రిజర్వ్‌‌డ్ కేటగిరీ సీట్లు భర్తీ చేస్తే ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. కానీ, ఇక్కడ తొలుత స్లైడింగ్‌‌లో మిగిలిపోయిన రిజర్వేషన్‌‌ సీట్లను భర్తీ చేసి, ఆ తర్వాత ఓపెన్ కేటగిరీ సీట్లను భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌‌లో పేర్కొన్నారు. దీంతో మెరిట్‌‌ ర్యాంక్ ఉన్న రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్లంతా రిజర్వేషన్ కేటగిరీ సీట్లలోకి వెళ్లిపోతారు. ఓపెన్ కేటగిరీ సీట్లలో చాలా వరకూ ఓసీలతో భర్తీ అవుతాయి. దీనిపైనే రిజర్వ్‌‌డ్‌‌ కేటగిరీ స్టూడెంట్ల తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

స్లైడింగ్ అంటే..

కౌన్సెలింగ్‌‌ ప్రక్రియలో భాగంగా తొలుత అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లోని ఓపెన్ కేటగిరీ సీట్లను మెరిట్ స్టూడెంట్లకు కేటాయిస్తారు. ఆ తర్వాత ర్యాంకర్లకు రిజర్వ్‌‌డ్‌‌ సీట్లను కేటాయిస్తారు. ఉదాహరణకు.. 155 ర్యాంక్ వచ్చిన బీసీ–డీ కేటగిరీ స్టూడెంట్‌‌ మహేశ్‌‌కు ఆదిలాబాద్ రిమ్స్‌‌లో సీటు వచ్చింది. 365వ ర్యాంక్ వచ్చిన సురేష్‌‌కు హైదరాబాద్‌‌ గాంధీలో బీసీ–డీ కేటగిరీ రిజర్వ్‌‌డ్ సీటు వచ్చింది. సీట్ల కేటాయింపు తర్వాత మహేశ్‌‌ రిమ్స్‌‌లో సీటు వదిలేసి, సురేష్‌‌కు కేటాయించిన సీటులో చేరొచ్చు. సీటు కోసం సురేష్‌‌ తదుపరి కౌన్సెలింగ్​లో పాల్గొనాల్సి ఉంటుంది. దీన్నే స్లైడింగ్ అంటారు. రిమ్స్‌‌లో ఖాళీ అయిన సీటును మళ్లీ బీసీ–డీ కేటగిరీ స్టూడెంట్‌‌కే కేటాయించాల్సి ఉంటుంది. ఇలా ఈ సారి సుమారు 300 మందికిపైగా స్టూడెంట్లు స్లైడింగ్ ద్వారా జనరల్​ కేటగిరీ నుంచి రిజర్వ్​డ్​ సీట్లలోకి మారారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్లను మెడిసిన్​ కోర్సులకు దూరం చేసే కుట్ర

సీట్లను పెంచాలి: అద్దంకి దయాకర్​

ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్లను మెడిసిన్​ కోర్సులకు దూరం చేసే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్  మండిపడ్డారు. స్టూడెంట్లకు న్యాయం జరగాలంటే రాష్ట్రంలో మెడిసిన్​ సీట్ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. మెడిసిన్​ కోర్సుల అడ్మిషన్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయం, భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్​ సంఘాల ఆధ్వర్యంలో  శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన అద్దంకి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్.. అప్పటి నుంచి అన్ని రంగాల్లో అనేక విధాలుగా కుట్రపన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

జీవో 141ని అడ్డం పెట్టుకునే చేస్తున్నరు

చాలా ఏండ్లుగా పోరాడి బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్లకు సీట్లు వచ్చేలా జీవో 550 తెప్పించాం. 2001 నుంచి ఈ జీవో ప్రకారమే కౌన్సెలింగ్ జరుగుతోంది. కానీ, గడిచిన రెండేండ్లుగా జీవో 141 అడ్డం పెట్టుకుని రిజర్వ్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ కేటగిరీ స్టూడెంట్లకు అన్యాయం చేసేలా కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ప్రగతి భవన్​ను ముట్టడిస్తాం.

– ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. కృష్ణయ్య, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు

కుట్ర చేస్తున్నరు

గత ఏడాది ఎంబీబీఎస్ సీట్ల భర్తీ, ఈ ఏడాది పీజీ సీట్ల భర్తీలోనూ రిజర్వ్‌‌‌‌‌‌‌‌డ్ కేటగిరీ స్టూడెంట్లకు అన్యాయం చేశారు. ఇప్పుడైనా సక్కగా చేయాలని మంత్రి ఈటలను కలిశాం. ఆయన ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి కౌన్సెలింగ్ ప్రక్రియలో మార్పులు చేయాలని సూచించారు. కానీ, జీవోలో ఉన్న లొసుగులను చూపించి, ఆఫీసర్లు తమకు నచ్చినట్టుగానే కౌన్సెలింగ్ చేస్తున్నారు. ఈ కుట్ర వెనుక సీఎంవో సెక్రటరీ రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, లా సెక్రటరీ సంతోష్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఉన్నారు.

– జాజుల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, బీసీ సంఘం ప్రెసిడెంట్

For More News..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలి