రూ.15 వేల నిరుద్యోగ భృతి.. రూ.10 లక్షల రుణ మాఫీ

రూ.15 వేల నిరుద్యోగ భృతి.. రూ.10 లక్షల రుణ మాఫీ

హర్యానా ఎన్నికల్లో ఐఎన్ఎల్డీ పార్టీ హామీ

గెలుపు కోసం ‘రికార్డు స్థాయి’ వరాలు

చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గరం గరంగా నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా ఓటర్ల ముందు ఎన్నికల హామీలు కురిపిస్తున్నాయి పార్టీలు. కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయి ‘నజరానా’లతో  హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసింది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ తమకు ఓటేయాలని కోరుతూ ప్రజలపై భారీ వరాలు కురిపించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీర్బల్ దాస్ ధాలియా,  సీనియర్ నేత ఆర్ఎస్ చౌధరీ కలిసి ఈ మ్యానిఫెస్టో రిలీజ్ చేశారు. అక్టోబరు 21న హర్యానా, మహారాష్ట్రల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.

ఓటర్లపై కురిపించిన వరాలివే:

  • యువతకు రూ.15 వేల నిరుద్యోగ భృతి
  • రైతులకు రూ.10 లక్షల రుణ మాఫీ
  • చిరు వ్యాపారులకు రూ.10 లక్షల వరకు రుణ మాఫీ
  • వృద్ధులకు నెలకు రూ.5 వేల పింఛన్
  • 35 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం
  • ఆర్థికంగా వెనుకబడిన యువతుల పెళ్లికి ‘కన్యాదానం’ పేరుతో రూ.5 లక్షల కానుక
  • పారిశుద్య కార్మికులకు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల బీమా
  • ప్రైవేటు ఉద్యోగాల్లో 75 శాతం హర్యానా యువతకే ఇచ్చేలా రిజర్వేషన్

ఇవి కాక, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతులకు మద్దతు ధర, ట్రాక్టర్లు.. వ్యవసాయ పరికరాలు.. ఎరువులు.. విత్తనాలపై జీఎస్టీ ఎత్తివేత, బాలికలకు ఉన్నత విద్య వరకు ఉచితంగా చదువు చెప్పించడం వంటి హామీలను ఐఎనఎల్డీ ప్రకటించింది.