స్ట్రాంగ్ రూం కీస్ మిస్సింగ్​పై ఎంక్వైరీ

స్ట్రాంగ్ రూం కీస్ మిస్సింగ్​పై ఎంక్వైరీ
  • జగిత్యాలలో త్రిమెన్ కమిటీ విచారణ 
  • మీడియాను అనుమతించని ఆఫీసర్లు 

జగిత్యాల/కొడిమ్యాల, వెలుగు: ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు వ్యవహారంపై కాంగ్రెస్​అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్​కుమార్​ కోర్టును ఆశ్రయించగా సోమవారం ఈసీ నుంచి వచ్చిన ఉన్నతాధికారులు విచారణ జరిపారు. స్ట్రాంగ్ రూం ఓపెన్​చేసి వివరాలు అందజేయాలన్న కోర్టు ఆదేశాలతో ఈ నెల10న కలెక్టర్​యాస్మిన్ భాషా, ఇతర అధికారులు వెళ్లినా తాళాలు లేక తెరవలేకపోయారు. మళ్లీ అడ్లూరి లక్ష్మణ్ కూమర్ హై కోర్టుకు వెళ్లగా ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో ఈనెల 26న తమకు నివేదిక అందజేయాలని ఈసీని ఆదేశించింది. దీంతో ఎలక్షన్ కమిషన్ ముగ్గురు ఆఫీసర్లతో త్రిమెన్ కమిటీ ఏర్పాటు చేసి ఎంక్వైరీ కోసం పంపించింది.

ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, జాయిట్ సెక్రటరీ రవి కిరణ్  కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూకు చేరుకున్నారు. ఎన్నికల సమయంలో ఆఫీసర్​గా ఉన్న అప్పటి కలెక్టర్​శరత్, ఇటీవల బదిలీపై వెళ్లిన కలెక్టర్ గుగులోతు రవి, ప్రస్తుత కలెక్టర్ యాస్మిన్ భాషా, గతంలో అడిషనల్ కలెక్టర్లుగా పని చేసిన అరుణ శ్రీ, రాజేశం, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్​భిక్షపతి ఎంక్వైరీకి హాజరయ్యారు. విచారణ జరుగుతున్న ప్రదేశానికి మీడియాను అనుమతించలేదు. ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్​త్రిమెన్ కమిటీకి వినతిపత్రం ఇస్తామని చెప్పినా కలిసేందుకు పర్మిషన్​ఇవ్వలేదు.