పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఆగ్రహం

పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఆగ్రహం

యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు నియోజకవర్గంలో పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని  మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు బొడిగె శోభ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల కార్లను తనిఖీ చేయడం వదిలేసి కేవలం  ప్రతిపక్ష నాయకుల కార్లను తనిఖీ చేయడం పోలీసులకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. మునుగోడు మండలం గూడపూర్ లో నిన్న రాత్రి ఎన్నికల ప్రచారం ముగించుకొని మునుగోడు క్యాంప్ ఆఫీసుకు తిరిగి వెళ్తుండగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీ చేశారు.

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన కారు దిగి పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వాహనం సైరన్ వేయగానే పంపించిన పోలీసులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాహనాన్ని ఆపి మరీ ఇబ్బంది పెట్టడం ఏంటని నిలదీశారు. బీజేపీ నాయకుల వాహనాలు తనిఖీ చేయడానికి తప్పు పట్టడం లేదు కానీ అధికార పార్టీకి తొత్తులుగా ఉండడమే బాధ కలిగిస్తోందన్నారు. పోలీసులకు జీతాలు ఇచ్చేది కేసీఆర్ కాదు  ప్రభుత్వం ఇస్తుందని గుర్తు చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై  ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రతి చోట కేంద్ర బలగాలతో తనిఖీలు చేయాలని బొడిగె శోభ డిమాండ్ చేశారు.