- ఫైళ్లను త్వరగా క్లియర్ చేయాలని అధికారులకు అభిలాష అభినవ్ ఆదేశం
- ప్రతిరోజూ రిపోర్టు ఇవ్వాల్సిందేనని వెల్లడి
- ప్రైవేటు కాలేజీల పరిస్థితిపై ఇంకా సస్పెన్స్
హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ కాలేజీల అఫిలియేషన్ల (అనుబంధ గుర్తింపు) ప్రక్రియ ఎట్టకేలకు పట్టాలెక్కింది. మంగళవారం ‘వెలుగు’ దినపత్రికలో ప్రచురితమైన ‘ఇంటర్ బోర్డు... ఇదేం అఫిలియేషన్?’ కథనానికి ఇంటర్ బోర్డు అధికారులు స్పందించారు. కొత్త సెక్రటరీగా అభిలాష అభినవ్ బాధ్యతలు చేపట్టిన నెల రోజులుగా ఒక్క కాలేజీకీ గుర్తింపు ఇవ్వకపోవడంపై వెలుగులో వచ్చిన కథనం విద్యావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో యంత్రాంగం ఒక్కసారిగా కదిలి.. మంగళవారం 85 ప్రభుత్వ కాలేజీలకు గుర్తింపునిస్తూ వెబ్‌సైట్‌లో వివరాలను అప్‌డేట్ చేసింది. ఆలస్యంపై ఇంటర్ బోర్డు ఒక ప్రకటన రిలీజ్ చేసింది.
- డైలీ రిపోర్ట్ ఇవ్వాల్సిందే..
అఫిలియేషన్లపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న అఫిలియేషన్ ఫైళ్లను యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయాలని, దీనిపై ప్రతిరోజూ తమకు నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి కాలేజీకి గుర్తింపు ఇస్తామని, మేనేజ్‌మెంట్లు కూడా తమ వద్ద పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్లు, ఫీజుల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. బోర్డు తన ప్రకటనలో గతేడాది కంటే ముందే (ఫిబ్రవరి 5న) నోటిఫికేషన్ ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ.. మూడు నెలలు దాటినా ప్రక్రియ ఎందుకు పూర్తి కాలేదన్న దానిపై సమాధానం చెప్పలేదు.
ఇదివరకు ఉన్న బోర్డు సెక్రటరీ కృష్ణఆదిత్య వెళ్లిపోయిన తర్వాత.. ఈ నెల రోజులుగా ఒక్క అఫిలియేషన్ కూడా ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నపై బోర్డు మౌనం వహించింది. అటు 16 జిల్లాల్లో ఒక్క ప్రైవేటు కాలేజీకి కూడా ఇప్పటివరకు గుర్తింపు రాకపోవడంపై బోర్డు స్పందిస్తూ.. తాము జిల్లాల వారీగా కోటాలు పాటించమని, డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటేనే ఇస్తామని దాటవేసే ప్రయత్నం చేసింది.
- ప్రభుత్వ కాలేజీలకూ అదే తిప్పలా?
ప్రైవేటు కాలేజీల సంగతి పక్కన పెడితే.. ప్రభుత్వ సెక్టార్‌లోని కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాలకు కూడా గుర్తింపు ఇవ్వడంలో బోర్డు ఎందుకు జాప్యం చేసిందనే దానిపై ఇంటర్ బోర్డు క్లారిటీ ఇవ్వలేదు. గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే చేరాలని ఒకవైపు ప్రకటనలు ఇస్తూ.. మరోవైపు అఫిలియేషన్ల జాబితాను పూర్తిస్థాయిలో ప్రకటించకుండా నాన్చడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, గడువు లోపే అఫిలియేషన్లు ఇస్తామని చెప్తుండటం గమనార్హం.
