హైదరాబాద్: ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిలిచింది. ఆదివారం (మే 31) గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ ఫైట్‌లో గుజరాత్‌ను చిత్తు చేసి ఆర్సీబీ వరుసగా రెండో సారి ఐపీఎల్ టైటిల్ ఎగరేసుకుపోయింది. అయితే, ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఈ సారి ఏ టీమ్ ట్రోఫీ గెలుస్తుందని ఎక్స్ వేదికగా ఓ నెటిజన్ తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రశ్నించాడు. దీనికి డీజీపీ సీవీ ఆనంద్ ఆసక్తికర రిప్లై ఇచ్చారు.
‘‘దురదృష్టవశాత్తు ఈ ఏడాది IPLలో 20 ఓవర్లలోనే 250కి పైగా భారీ స్కోర్లు నమోదవడం.. ప్రతి బంతిని బాదేయడం, బౌలర్లు మూర్ఖుల్లా కనిపించేలా చేయడం చూసినప్పుడు నాకు ఈ టోర్నమెంట్‌పై ఆసక్తి పూర్తిగా సన్నగిల్లింది. ఇది క్రికెట్ అనిపించుకోదు, ఇందులో ఏమాత్రం మజా లేదు’’ అని డీజీపీ సీవీ ఆనంద్ రిప్లై ఇచ్చారు.
డీజీపీ సీవీ ఆనంద్ రిప్లైతో కొందరు నెటిజన్లు సమర్థిస్తుండగా.. మరికొందరు విభేదిస్తున్నారు. ఆనంద్ సర్ చెప్పింది నిజమేనని.. ఐపీఎల్ కేవలం బ్యాటర్స్ టోర్నీగా మారిపోయిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ టోర్నీలో అన్ని మ్యాచులు ఏకపక్షంగా జరగలేదని.. కొన్ని మ్యాచుల్లో బౌలర్లు కూడా అధిపత్యం చెలాయించారని ఇంకొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా.. ఐపీఎల్ అంటేనే ధనాధన్ లీగ్ అని.. బ్యాటర్ల డామినేషన్ కామన్ అని కామెంట్స్ చేస్తున్నారు.
