
సిద్దిపేట జిల్లాలోని జగదేవ్‌పూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. తన కూతురిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడనే కోపంతో యువకుడి తల్లిపై దాడి చేశాడు అమ్మాయి తండ్రి. తీవ్ర గాయాలపాలైన యువకుడి తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
వివరాల ప్రకారం.. బస్వాపూర్ గ్రామానికి చెందిన అబ్బాస్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన రెడ్డి కులానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన కూతురు అబ్బాస్‌ను మతాంతర వివాహం చేసుకోవడం ఇష్టంలేని యువతి తండ్రి కోపంతో రగిలిపోతున్నాడు. ఈ క్రమంలోనే అబ్బాస్ ఇంటిపై దాడి చేశాడు అమ్మాయి తండ్రి. అడ్డువచ్చిన యువకుడి తల్లి షాహిన్ బేగం తలపై రాడ్డుతో బలంగా దాడి చేశాడు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ షాహిన్ బేగంను స్థానికులు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయం బలంగా కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ షాహిన్ బేగం మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో బస్వాపూర్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా గజ్వేల్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.