ఇంటర్ బోర్డు సిబ్బందికి మళ్లీ ఓటీ!

ఇంటర్ బోర్డు సిబ్బందికి మళ్లీ ఓటీ!
  • ఈ ఏడాది నుంచి ఇవ్వాలని సర్కారు నిర్ణయం 

హైదరాబాద్, వెలుగు :  ఇంటర్మీడియెట్ పరీక్షల సమయంలో అడిషనల్​గా పనిచేసిన సిబ్బందికి ఓవర్ టైమ్ (ఓటీ) అలవెన్స్ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. గతేడాది అప్పటి బోర్డు సెక్రటరీ  నవీన్ మిట్టల్ దీన్ని నిలిపివేశారు. దీనిపై అప్పటి నుంచి బోర్డు సిబ్బంది గుర్రుగా ఉన్నారు. తాజాగా సర్కారుతో పాటు బోర్డు సెక్రటరీ మారడంతో ఉద్యోగులు మళ్లీ సర్కారు దృష్టికి తీసుకుపోయారు. దీంతో ఈ ఏడాది నుంచి మళ్లీ ఓటీ ఇచ్చేందుకు సర్కారు అంగీకరించింది. ఇంటర్ బోర్డులో పనిచేసే సిబ్బందికి ఓటీ అలవెన్స్ 1982 నుంచి అమలు చేస్తున్నారు. పరీక్షల సమయంలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు విధుల్లో ఉండటం, కాన్ఫిడెన్షియల్ వర్క్​లో టైమ్, సెలవు దినాలతో సంబంధం లేకుండా పనిచేస్తుండడంతో వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా అలవెన్స్ ఇస్తోంది. మార్చి పబ్లిక్ పరీక్షల సమయంలో 40 రోజులు, సప్లిమెంటరీకి 30 రోజుల పాటు ఓటీ ఇచ్చే వారు. మొత్తంగా70 రోజుల పాటు బోర్డు ఉద్యోగులకు బేసిక్ పే, డీఏతో కలిపి ఇస్తారు. 2017 నుంచి బోర్డు ఉద్యోగులతో పాటు డీఐఈఓలు, నోడల్ ఆఫీసర్లకూ దీన్ని అమలు చేస్తున్నారు. అయితే, 2022–23 విద్యాసంవత్సరంలో  అప్పటి బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆదేశాలతో ఆగిపోయింది. దశాబ్దాలుగా ఇస్తున్న ఓటీని ఆపడంపై అప్పట్లో బోర్డు సిబ్బంది తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అయినా, చేసేదేమీ లేక ఆగిపోయారు. తాజాగా సమస్యను ప్రస్తుత సర్కారు దృష్టికి తీసుకుపోయారు. దీంతో 2023–24 విద్యాసంవత్సరం నుంచి ఓటీ అలవెన్స్ మళ్లీ కంటిన్యూ చేయాలని ఇంటర్ బోర్డుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా సూచించింది. కేవలం ఎగ్జామ్స్ పనుల్లో పాల్గొనేవారికే ఇవ్వాలని బోర్డు అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది.