- సీసీ కెమెరాల నిఘాలో పరీక్షల నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 2 నుంచి నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఫిబ్రవరి 21వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఈ మేరకు శనివారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సారి ఎంపీసీ, బైపీసీ, ఒకేషనల్ కోర్సులు కలిపి మొత్తం 5,26,192 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్ రాయబోతున్నారని పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1,440 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రాక్టికల్స్ ప్రతిరోజూ రెండు పూటలా జరుగుతాయని ఆయన వివరించారు.
సీసీ కెమెరాలతో డేగ కన్ను
పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల ల్యాబ్‌లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని చెప్పారు.
వీటిని ఇంటర్ బోర్డు ప్రధాన కార్యాలయంలోని ‘కమాండ్ కంట్రోల్ సెంటర్’ కు అనుసంధానించామని, అక్కడి నుంచే పరీక్షల నిర్వహణను లైవ్ మానిటరింగ్ చేస్తామని పేర్కొన్నారు. జిల్లాల్లో హైపవర్ కమిటీలు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ నిరంతరం పర్యవేక్షిస్తాయని వివరించారు.
కాలేజీ లాగిన్లలో హాల్ టికెట్లు
ప్రాక్టికల్స్ కు సంబంధించిన హాల్ టికెట్లను ఇప్పటికే కాలేజీల లాగిన్లలో అందుబాటులో ఉంచామని, విద్యార్థులకు ఆ లింక్ పంపించినట్టు చెప్పారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు 92402 05555 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓలు బి. రాహుల్, యువరాజ్ మర్మట్, ఇంటర్ బోర్డు సీఓఈ జయప్రదబాయి, జాయింట్ సెక్రటరీలు మోహన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
