కూలీగా మారిన భారత ఫుట్ బాల్ క్రీడాకారిణి

కూలీగా మారిన భారత ఫుట్ బాల్ క్రీడాకారిణి

రాంచీ: అవును మీరు చదివింది నిజమే. ఆమె నిన్నటి వరకు భారత జాతీయ ఫుట్ బాల్ జట్టు అండర్-19 జట్టు కెప్టెన్. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అద్వితీయమైన ప్రతిభతో జాతీయ ఫుట్ బాల్ జట్టుకు ఎంపిక కావడమే కాదు అంచెలంచెలుగా ఎదిగింది. తొలుత అండర్ -18 జట్టుకు కెప్టెన్ గా అదే ఊపులో అండర్ -19 జట్టుకు కెప్టెన్ గా ఎదిగింది..తర్వాత సీనియర్ భారత జాతీయ ఫుట్‌బాల్‌ జట్టులో కూడా చోటు సంపాదించింది. ఇలా ఫుట్ బాల్ క్రీడలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన 20 ఏళ్ల సంగీత సోరెన్ కు  కరోనా లాక్ డౌన్ కోలుకోలేని దెబ్బతీసింది. కళ్లు లేని తండ్రి, ఉపాధి కోల్పోయిన అన్న వల్ల ఇల్లు గడవడమే కష్టంగా మారడంతో ఇటుక బట్టీలో కూలీగా మారింది. ఇంటి వద్ద ఉన్నప్పుడు కుటుంబానికి చేదోడు వాదోడుగా అప్పుడప్పుడు కుటుంబం కోసం కూలీ పనులు చేసేది. కరోనా లాక్ డౌన్ తర్వాత ఆటలన్నీ బంద్ కావడంతో కూలీగా మారాల్సి వచ్చింది. 

జార్ఘండ్‌లోని ధన్‌బాద్‌ జిల్లా బాగ్మారా గ్రామానికి చెందిన 20 ఏళ్ల సంగీతో సోరెన్‌ చిన్న నాటి నుండి ఆటలపై మక్కువతో ఫుట్ బాల్ లో సాధన చేసింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఫుట్ బాల్ జాతీయ జట్టుకు ఎంపికైంది. అలా 2018లో అండర్‌-18, అండర్‌-19 జట్లుకు పోటీలకు ఎంపికై ఏకంగా కెప్టెన్‌గా వ్యవహరించింది. అలా మంచి ప్రదర్శనతో సీనియర్‌ జట్టులో కూడా చోటు సంపాదించింది. జాతీయ జట్టు తరపున కొన్ని మ్యాచులు ఆడితే చాలు ఏదైనా జీవితంలో ఆర్ధికంగా స్థిరపడిపోతానని కలలు కంటున్న సమయంలో కరోనా లాక్‌డౌన్‌ ఆమె కెరీర్‌పై దెబ్బకొట్టింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆమె కుటుంబం ఆర్థిక స్థితి కరోనా లాక్ డౌన్ దెబ్బకు కూలీగా తట్టలు, బుట్టలు మోయాల్సి వచ్చింది. తండ్రి దూబా సోరెన్‌ కు కళ్లు లేవు. కూలీ పనులు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చే అన్నకు.. లాక్‌డౌన్‌ వల్ల పని దొరకడం కష్టంగా మారింది. దీంతో కుటుంబ భారాన్ని మోయడం కోసం  తల్లితో కలిసి బట్టీలో ఇటుకలు మోసే పనిచేస్తోంది సంగీత. ఈమె పరిస్థితి గురించి స్థానిక మీడియాలో వార్తలు రావడంతో  సంగీతకు ప్రోత్సాహం అందిస్తామని, ఆమె కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ గతంలో ప్రకటించారు. అయితే ఈ హామీ రెండో విడత లాక్ డౌన్ లో కూడా నెరవేరలేదు. మరోవైపు సంగీత దుస్థితి తెలుసుకున్న జాతీయ మీడియాపై ఈమె దుస్థితిపై స్పందించి కథనాలు ప్రసారం చేయడంతో కలకలం రేపింది. 
లక్ష రూపాయల సాయం అందించిన జార్ఖండ్ ప్రభుత్వం
కుటుంబ పోషణ కోసం ఇటుకల బట్టీలో పని చేస్తున్న ఫుట్ బాల్ క్రీడాకారిణి సంగీతా సొరేన్ ఉదంతం కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాల్లో కదలిక తెచ్చింది. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ఆమెకు తక్షణ సాయం అందజేయాలని ఆదేశించడంతో బ్లాక్ డెవలప్ మెంట్ అధికారి సోమవారం గ్రామానికి వెల్లి ప్రభుత్వం తరపున లక్ష రూపాయల సాయాన్ని అందజేశారు. అంతేకాదు ధన్ బాద్ లో ఫుట్ బాల్ ట్రెయినింగ్ కోచ్ గా ఆమెకు ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం తరపున ఆ అధికారి హామీ ఇచ్చారు. మరోవైపు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా సంగీత  దుస్థితి తెలుసుకుని ఆర్ధిక సహాయం చేస్తామని ప్రకటించారు. తాను పంపిన సాయం తొందరర్లోనే ఆమెకు అందుతుందని కేంద్ర క్రీడల మంత్రి హామీ ఇచ్చారు. 20 ఏళ్ల సంగీత 2018=19 లో ఇండియా తరఫున భూటాన్, థాయిలాండ్ లలో జరిగిన అండర్ 17, అండర్ 18 ఫుట్ బాల్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించినా కుటుంబం కోసం కూలీగా మారడం కదిలించిందని కేంద్ర క్రీడల శాఖా మంత్రి పేర్కొన్నారు. తనకు ఝార్ఖండ్ ప్రభుత్వం చేసిన సాయానికి సంగీత కృతఙ్ఞతలు తెలిపింది.