ఐటీఎఫ్ ఇకపై వరల్డ్ టెన్నిస్

ఐటీఎఫ్ ఇకపై వరల్డ్ టెన్నిస్

లండన్: ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) తన పేరును ‘వరల్డ్ టెన్నిస్’ గా మార్చుకుంటోంది. లండన్ కేంద్రంగా పని చేసే ఈ సంస్థ డేవిస్ కప్, బిల్లీ జీన్ కింగ్ కప్ టీమ్ ఈవెంట్లతో పాటు ఒలింపిక్స్, పారాలింపిక్స్‌‌లలో టెన్నిస్ క్రీడను ఇది పర్యవేక్షిస్తుంది. ప్రొఫెషనల్ టెన్నిస్ విభాగాన్ని నిర్వహించడానికి ఏటీపీ, డబ్ల్యూటీఏ టూర్స్‌‌తో పాటు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ అనే నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్‌‌లతో కలిసి పనిచేస్తుంది. 

గత అక్టోబర్‌‌లో జరిగిన ఈ గవర్నింగ్ బాడీ వార్షిక జనరల్ మీటింగ్‌‌లో సభ్య దేశాల టెన్నిస్ అసోసియేషన్లు ఓటింగ్ ద్వారా ఈ పేరు మార్పును ఆమోదించాయి. ఈ సందర్భంగా వరల్డ్ టెన్నిస్ ప్రెసిడెంట్ డేవిడ్ హాగెర్టీ మాట్లాడారు. ‘‘ప్రపంచ టెన్నిస్ రంగంలో మా పాత్రను పునర్నిర్వచించుకోవడానికి, ఈ అద్భుతమైన క్రీడకు బలమైన, స్థిరమైన భవిష్యత్తును అందించేలా మా నిబద్ధతను చాటుకోవడానికి ఈ రోజు ఒక గొప్ప అవకాశం. 

వరల్డ్ టెన్నిస్ అనే పేరు మా గుర్తింపును, ప్రపంచవ్యాప్తంగా మాకున్న పరిధిని, మా ప్రత్యేకమైన బాధ్యతను ప్రతిబింబిస్తుంది”అని తెలిపారు. ఇటీవలి కాలంలో వరల్డ్ అథ్లెటిక్స్, వరల్డ్ అక్వాటిక్స్, వరల్డ్ జిమ్నాస్టిక్స్, వరల్డ్ రగ్బీ వంటి అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు కూడా ఇలాగే తమ పేర్లను మార్చుకున్నాయి.