స్త్రీ లేకపోతే మనిషి జననం లేదు. అసలు సృష్టే లేదు. సమాజంలో మహిళలు సాధించిన విజయాలను స్మరించుకుంటూ ముందు తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా.. ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’గా జరుపుకుంటున్నాం.
ఈ రోజున మహిళలు ఆర్థికంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా విజయాలు జరుపుకునే రోజుగా చెప్పవచ్చు. సామాజిక హోదా, సమానత్వం, ప్రశంస, గౌరవం మహిళా దినోత్సవ లక్షణాలుగా చెప్పుకుంటున్నాం. స్త్రీలు నేడు అనేక రంగాలలో అనేక విజయాలు సాధిస్తున్నారు.
విద్య, వైద్య, సామాజిక రంగాలలో ఎక్కువ ప్రగతిని సాధిస్తున్నారు. దుర్గాబాయి దేశ్ముఖ్, సరోజినీ నాయుడు, విజయలక్ష్మి పండిట్ మొదలగువారు బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడి స్వాతంత్ర్య ఉద్యమంలో విజయం సాధించారు. అయినప్పటికీ నేటి ఆధునికకాలంలో ఆర్థిక, రాజకీయ ప్రగతిలో కొంతవరకు మహిళలు వెనుకంజలో ఉన్నారని చెప్పక తప్పదు.
మహిళలు రాజకీయాల్లో రాణించాలి
భారతదేశంలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం.. మహిళా శ్రామికశక్తి భాగస్వామ్యం 2023-–24 నాటికి సుమారు 40%- 42% మధ్యలోనే ఉంది. అలాగే ఉపాధి రేటు 40.3% మాత్రమే ఉంది. ఇంకా ఉపాధి రంగంలో మహిళలు ఎంతో ప్రగతి సాధించవలసిన ఆవశ్యకత ఉంది.
2024 సంవత్సరంలో దేశంలో జరిగిన లోక్సభ సాధారణ ఎన్నికలలో మొత్తం 543 పార్లమెంట్ స్థానాలకుగాను 74 మంది మహిళలు మాత్రమే లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది మొత్తంగా 13.6% మాత్రమే. అదే విధంగా 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో 78 మంది మహిళా సభ్యులు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను కేవలం ఐదుగురు మహిళా సభ్యులైన.. కొండా సురేఖ (వరంగల్ తూర్పు), ధనసరి అనసూయ సీతక్క (ములుగు), వాకిటి సునీత లక్ష్మారెడ్డి (నర్సాపూర్), చిట్టెం పర్ణికరెడ్డి (నారాయణపేట), యశస్విని రెడ్డి( పాలకుర్తి) మాత్రమే అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రాజకీయ పార్టీల పరంగా చూస్తే బీజేపీ నుంచి ఎక్కువ మంది మహిళలు చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, మిగతా ప్రాంతీయ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ ప్రాతినిధ్యం ద్వారానే మహిళా సామాజిక సాధికారత అనేది సాధ్యమవుతుంది. దేశ, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలు మహిళలకు అధికంగా లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే విధంగా అవకాశం కల్పించాలి.
డా. కోడూరు శ్రీవాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్, శాతవాహన విశ్వవిద్యాలయం
* ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
