కొత్తగా చేరినోళ్లతో కారులో కిరికిరి

కొత్తగా చేరినోళ్లతో కారులో కిరికిరి
  • పాత లీడర్లు, కొత్త ఎమ్మెల్యేల మధ్య ఫైటింగ్‌.. పన్నెండు నియోజకవర్గాల్లో పరేషాన్
  • పరిషత్‌ ఎన్నికల్లో బయటపడ్డ విభేదాలు.. కొన్నిచోట్ల కొట్లాటలు.. ఇంకొన్ని చోట్ల కేసులు

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో విలీనం చేసుకున్న టీఆర్ఎస్‌లో ఇంటిపోరు మొదలైంది. ఎమ్మెల్యేలను కలిపేసుకున్న నియోజకవర్గాల్లో పాతోళ్లకు, కొత్తగా వచ్చినోళ్లకు పొసగడం లేదు.  కొత్తోళ్లను తెచ్చి తమకు పొగ పెట్టారని పాత నేతలు లోలోపల రగిలిపోతున్నారు. నేతల మధ్య దోస్తీ కుదరకపోవటంతో పార్టీ కేడర్ కూడా రెండు  వర్గాలుగా చీలిపోయింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు నువ్వా–నేనా అన్నట్టుగా కత్తులు దూసుకున్న లీడర్ల అనుచరులు ఎడమొఖం పెడమొఖంగానే ఉంటున్నారు. పేరుకు ఒకే పార్టీలో ఉంటున్నా లోకల్‌గా తమది డామినేషన్ అంటే.. తమదేనంటూ గొడవలకు దిగుతున్నారు. ఇది పరిషత్​ఎన్నికల్లో కొన్నిచోట్ల బాహాబాహీ కొట్టుకునేంత వరకు వెళ్లింది.

మాజీ మంత్రులకు సెగ

నాగర్ కర్నూల్ జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత నియోజకవర్గం కొల్హాపూర్‌లో లొల్లి ముదిరింది. కాంగ్రెస్‍ ఎమ్మెల్యే హర్షవర్ధన్‍రెడ్డి చేరికతో పార్టీలో వర్గ భేదాలు తారస్థాయికి చేరాయి. ఆయన చేరికను ముందునుంచీ జూపల్లి వ్యతిరేకించినా.. ఉమ్మడి జిల్లాలో గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేను తీసుకుంటే అక్కడ పార్టీ ఖల్లాస్ అవుతుందన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ నాయకత్వం పావులు కదిపింది. చివరికి ఆయన చేరిపోవడంతో జూపల్లి వర్గీయులుఆగ్రహంతో పరిషత్ ఎన్నికల్లో అన్ని మండలాల్లో టీఆర్‍ఎస్‍కు రెబెల్ క్యాండెట్లను పోటీకి దింపారు. కొన్ని మండలాల్లో జూపల్లి వర్గపు క్యాండిడేట్లే కీలకంగా మారారు. పెంట్లవెల్లిలో శుక్రవారం ఎంపీపీ ఎన్నిక జూపల్లి వర్గం, కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. చివరికి పోలీసులు లాఠీచార్జి చేసి రెండు గ్రూపులను చెదరగొట్టాల్సి వచ్చింది. పాలేరులో ఎంపీటీసీ, జడ్పీటీసీ బీఫామ్‌ల విషయంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అనుచరులను కందాల ఉపేందర్ రెడ్డి పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. టీఆర్ఎస్ మొదట్నుంచి ఉన్న కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వకుండా సొంత వర్గానికే ఆయన టికెట్లు కేటాయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. తిరుమలాయపాలెంలో ఒకరోజు ముందు టీఆర్‌ఎస్‌లో చేరిన కందాల క్రాంతి కుమార్‌కు జడ్పీటీసీ టికెట్ ఇవ్వగా పార్టీలోని మరోవర్గం నేతలు వందకుపైగా నామినేషన్లు వేసి తిరుగుబాటు చేశారు. నేతల జోక్యంతో నామినేషన్లు ఉపసంహరించుకున్నా.. వర్గ విభేదాలతో టీఆర్ఎస్ అక్కడ ఓడిపోయింది. కొత్తగూడెంలో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు మధ్య వర్గ పోరు నెలకొంది. వనమాఎన్నిక చెల్లదంటూ వెంకట్రావు వేసిన పిటిషన్ పై కోర్టులో విచారణ జరుగుతోంది. దీంతో స్థానికంగా పాత, కొత్త నేతల మధ్య అంతరం కొనసాగుతోంది.

పాయం.. భార్యకు పదవి పాయె..

పినపాకలో ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే పాయం వర్గాల మధ్య ఆధిపత్య పోరు కంటిన్యూ అవుతోంది. మణుగూరు మండలంలో పాయం తన భార్య ప్రమీలను ఎంపీపీగా చేయాలని చివరి వరకు పట్టుబట్టారు. కానీ తన వర్గానికి చెందిన కారం విజయకుమారిని ఎంపీపీగా గెలిపించుకునేందుకు రేగా కాంతారావు పావులు కదిపారు. దీంతో పాయం టీఆర్ఎస్​నుంచి మరో పార్టీకి జంప్ అవుతారని ఆయన వర్గీయుల్లో చర్చ జరుగుతోంది.

కేసుల దాకా వెళ్లిన హరిప్రియ

ఇల్లెందులో మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య, కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే హరిప్రియ వర్గీయుల మధ్య గొడవ ముదిరింది. బయ్యారం ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఇరువర్గాలు ఎంపీడీవో ఆఫీసు ముందు గొడవకు దిగారు. స్థానిక పోలీస్ స్టేషన్​లో ఎమ్మెల్యే వర్గీయులు ఫిర్యాదు చేశారు .

టీఆర్ఎస్​ క్యాండిడేట్‌ను బలపరిచే దిక్కులేక..

కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మధ్య విబేధాలు తీవ్రంగా మారాయి. ఇద్దరూ ఎవరికి వారుగా గ్రూపులు మెయింటెన్ చేస్తున్నారు. ఆత్రం సక్కు పార్టీలో చేరినప్పట్నుంచీ కోవ లక్ష్మికి అండగా ఉన్న ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికలో ఇక్కడి గ్రూపు రాజకీయాలు మరింత ముదిరాయి. రాష్ట్ర పార్టీతో పాటు ఎమ్మెల్యే ఆత్రం సక్కు… గాదివేణి మల్లేష్ ను ఎంపీపీగా చేయాలని సూచించారు. అయితే అదేమీ ఖాతరు చేయకుండా ఆసిఫాబాద్ జడ్పీటీసీ అరిగేల నాగేశ్వర్‌రావు తన తమ్ముడు మల్లికార్జునను ఎంపీపీగా గెలిపించుకున్నారు. టీఆర్‌ఎస్‌ అధిష్టానం సూచించిన క్యాండిడేట్‌ను బలపరిచే వారు కూడా లేకపోవటం గమనార్హం.

ఎల్లారెడ్డిలో జాజల వర్సెస్‌ రవీందర్‌

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జాజల సురేందర్ చేరికతో వర్గ పోరు షురూ అయింది. మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, ఎమ్మెల్యే సురేందర్ రెండు వర్గాలుగా విడిపోయారు. పరిషత్ ఎన్నికల టికెట్ల కేటాయింపు నుంచే ఇద్దరి మధ్య లొల్లి మొదలైంది. చివరికి సదాశివనగర్, రామారెడ్డి, తాడ్వాయి మండలాల్లో రెబెల్ క్యాండిడేట్లు రంగంలోకి దిగారు. మొదట్నుంచి పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరిగిందని రవీందర్​రెడ్డి వర్గీయులంటున్నారు.

నకిరేకల్‌లో రెండుగా చీలిన పార్టీ

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేరికతో ఇక్కడ టీఆర్ఎస్ రెండుగా చీలింది. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తనదే పైచేయిగా ఉండాలని పరిషత్ ఎన్నికల్లో పంతానికి దిగారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తన వర్గం మనుషులను రెబల్ క్యాండిడేట్లుగా నిలబెట్టారు. ఐదు మండలాల్లో ఎక్కువ మంది రెబెల్స్​గెలిచి పార్టీ క్యాండిడేట్లు ఓడిపోయారు. లింగయ్యను పార్టీలోకి తేవడంలో నేతి విద్యాసాగర్​కీలక పాత్ర పోషించారు. ఆ కోపంతో ఎన్నికల సమయంలో  విద్యాసాగర్ సొంత గ్రామం చెరుకుపల్లి లో ఆయన వర్గీయులపై వీరేశం అనుచరులు దాడి చేశారు.

భూపాలపల్లిలో అంతర్గత కుమ్ములాటలు

కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యే గండ్ర చేరికతో భూపాలపల్లి టీఆర్ఎస్‌లో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయి. తన భార్యను జడ్పీ చైర్ పర్సన్ చేసేందుకే గండ్ర పార్టీ మారినట్లు చర్చ జరగడంతో పార్టీ కేడర్ చెల్లాచెదురైంది. మాజీ స్పీకర్ మధుసూదనాచారి సైలెంటయ్యారు. ఆయన వర్గీయులందరూ పార్టీ వ్యవహారాలకు అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. పరిషత్ ఎలక్షన్లలో మొదట్నుంచి టీఆర్ఎస్​లో పని చేసిన కార్యకర్తలకు కాకుండా కాంగ్రెస్ నుంచి గండ్రతో వచ్చిన వారికి ఎక్కువ బీఫారాలు దక్కాయి. దీంతో ఇక్కడ పార్టీ కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయారు.