విజయ్‌తో నాకు వైరం లేదు.. ఆ రూమర్స్ ఆపండి.. ఫ్యాన్స్ వార్స్‌పై అజిత్ సీరియస్!

విజయ్‌తో నాకు వైరం లేదు.. ఆ రూమర్స్ ఆపండి.. ఫ్యాన్స్ వార్స్‌పై అజిత్ సీరియస్!

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ గా వెలుగొందుతున్న నటులు అజిత్ కుమార్, విజయ్. వీరి సినిమాలు వస్తున్నాయంటే చాలు అభిమానులకు పండగే. థియేటర్ల దగ్గర వారి హడావుడి అంతా ఇంతా కాదు. ఒక్కొసారి వీరి అభిమానం హద్దులు దాటి గొడవలకు దారి తీస్తుంది.  దీంతో ఈ అభిమానుల మధ్య తరచూ జరిగే వాదోపవాదాలు, ఆన్‌లైన్ గొడవలు ఎప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. అసలు ఈ హీరోస్ మధ్య నిజంగానే పడడం లేదంటూ మీడియాలో వచ్చే ఊహాగానాలు ఈ ఫ్యాన్ వార్స్‌కు మరింత ఆజ్యం పోస్తున్నాయి.

విజయ్‌కు ఎల్లప్పుడూ శుభాకాంక్షలే..

లేటెస్ట్ గా అజిత్ కుమార్ ఈ వివాదాలపై, ముఖ్యంగా విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై తనకున్న వైరుధ్యం గురించిన వస్తున్న వార్తలపై సంచలన రీతిలో రియాక్ట్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో విజయ్‌తో తనకు వైరం ఉందంటూ వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. కొంతమంది వ్యక్తులు కావాలనే అవాస్తవాలను సృష్టించి, నాకూ విజయ్‌కూ మధ్య అపార్థాలు పెంచుతున్నారని మండిపడ్డారు. దీని ఫలితంగా అభిమానుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటువంటి తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులు నోరు మూసుకుంటే చాలా మంచిదని హితవు పలికారు. విజయ్ కి ఎల్లప్పుడూ మంచి జరగాలని నేను కోరుకుంటాను అని చెప్పారు.

అభిమాన పోరాటాల నుంచి దృష్టి మరల్చి, తమ కుటుంబాలపై, సంతోషకరమైన జీవితంపై దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ కి అజిత్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రకటన ద్వారా, తమ ఇద్దరి మధ్య వ్యక్తిగత వైరం లేదని, అభిమానులే అనవసరంగా సమస్యలు సృష్టిస్తున్నారనే సందేశాన్ని స్పష్టం చేసినట్లైంది. అభిమానులు కలిసిమెలిసి ఉండాలని కోరారు.

 అజిత్-విజయ్ బంధానికి నిదర్శనంగా.. 

ఇటీవల విజయ్ రాజకీయ సభలో జరిగిన ఒక సంఘటన, ఈ ఇద్దరు స్టార్ల మధ్య ఉన్న అనుబంధాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది. ఒక అభిమాని తీసుకువచ్చిన అజిత్, విజయ్ ఇద్దరూ ఉన్న ప్రత్యేకమైన ఫొటోపై విజయ్ చిరునవ్వుతో ఆటోగ్రాఫ్ ఇచ్చారు. రాజకీయ వేదికపై విజయ్ చూపించిన ఈ స్నేహపూర్వక చర్య, అజిత్ అభిమానులు కూడా ఆయన్ని ఆదరిస్తున్నారనే విషయాన్ని నిరూపించింది.

 పద్మభూషణ్ వివాదం

ఈ ఏడాది అజిత్ కుమార్‌కు పద్మభూషణ్ పురస్కారం దక్కినప్పుడు, విజయ్ శుభాకాంక్షలు తెలపలేదంటూ వచ్చిన పుకార్లను అజిత్ మేనేజర్ సురేశ్ చంద్ర తోసిపుచ్చారు. ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని  చెప్పారు. అజిత్ సర్‌కు రేసింగ్‌లో విజయం దక్కినప్పుడు ముందుగా అభినందించిన వారిలో విజయ్ ఒకరు. అదేవిధంగా, పద్మభూషణ్ అవార్డు ప్రకటించినప్పుడు కూడా విజయ్ సార్ శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరి మధ్య బలమైన స్నేహం ఉంది అని స్పష్టం చేశారు.

సాంకేతికంగా వారి అభిమానుల మధ్య ఎన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ, అజిత్, విజయ్ ఇద్దరూ వ్యక్తిగత స్థాయిలో పరస్పర గౌరవాన్ని, మిత్రుత్వాన్ని కొనసాగిస్తున్నారనేది ఈ సంఘటనలే రుజువు చేస్తున్నాయని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అభిమానులు కూడా తమ హీరోల మధ్య ఉన్న ఈ సామరస్యాన్ని గుర్తించి, అనవసరమైన గొడవలకు స్వస్తి చెప్పాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ తన 'జన నాయగన్' చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. అజిత్ కుమార్ చివరిగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రంలో కనిపించారు. ఆయన తదుపరి ప్రాజెక్టు కోసం రెడీ అవుతున్నారు.