MS Dhoni: ఐపీఎల్ 2026కి ధోనీ సిద్ధం.. కన్ఫర్మ్ చేసిన CSK సీఈఓ కాశీ విశ్వనాధ్

MS Dhoni: ఐపీఎల్ 2026కి ధోనీ సిద్ధం.. కన్ఫర్మ్ చేసిన CSK సీఈఓ కాశీ విశ్వనాధ్

చెన్నై సూపర్ కింగ్స్, ధోనీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. CSK మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 2026 ఐపీఎల్ ఆడడం కన్ఫర్మ్ అయింది. సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాధ్ శుక్రవారం (నవంబర్ 7) న ధోనీ 2026 ఐపీఎల్ ఆడతాడని ధృవీకరించినట్టు క్రిక్ బజ్ కన్ఫర్మ్ చేసింది. "తదుపరి సీజన్‌కు అందుబాటులో ఉంటానని MS మాకు చెప్పారు" అని విశ్వనాధ్ చెప్పారు. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన తర్వాత ధోనీ 2026 ఐపీఎల్ ఆడతాని చెప్పలేదు. పైగా మోకాలి గాయంతో ఆడడంతో 2026 ఐపీఎల్ ఆడే విషయంలో అనుమానాలు నెలకొన్నాయి. సీఈఓ కాశీ విశ్వనాధ్ క్లారిటీ ఇవ్వడంతో ధోనీ ఐపీఎల్ జర్నీ కొనసాగనుంది. 

నవంబర్ 15న రిటెన్షన్ గడువుకు ముందే ట్రేడ్ చర్చలు ప్రారంభమయ్యాయి. ఐపీఎల్ 2-026 సీజన్ కోసం ప్రణాళికలు రూపొందించడానికి  చెన్నై సూపర్ కింగ్స్ నవంబర్ 10, 11 తేదీలలో ఒక సమావేశాన్ని నిర్వహించనుంది. CEO కాశీ విశ్వనాథ్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు ధోనీ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఐపీఎల్ 2025 సీజన్ లో ఋతురాజ్ గాయం కారణంగా టోర్నీ నుంచి మధ్యలోనే తప్పుకోవడంతో మిగిలిన మ్యాచ్ లకు ధోనీ కెప్టెన్సీ చేశాడు. ఐపీఎల్ 2008 లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న ధోనీ మధ్యలో రెండు సీజన్ (2016,2017)ల పాటు  రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ తరపున 30 మ్యాచ్ లు ఆడాడు. 

ఐపీఎల్ 2025 సీజన్‌లో ధోని పెద్దగా రాణించలేదు. ఈ సీజన్ లో మొత్తం 14 మ్యాచ్‌ల్లో 24.50 సగటుతో 196 పరుగులు చేశాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. గత సీజన్ లో రుతురాజ్ గైక్వాడ్ కు CSK కెప్టెన్సీని అప్పగించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోని 248 మ్యాచ్‌లు ఆడి 4,865 పరుగులు చేశాడు. జట్టును ఏకంగా ఐదు సార్లు ఛాంపియన్స్ గా నిలిపాడు. 2010, 2011, 2018, 2021, 2023లో చెన్నై జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. 

త్వరలో రిటైన్ ప్లేయర్లపై సమావేశం:
 
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై దృష్టి పెట్టింది. రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను చర్చించడానికి త్వరలో మహేంద్ర సింగ్ ధోనీతో ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ త్వరలో సమావేశం కానున్నారు. రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై ఈ ముగ్గురూ చర్చించనుండగా.. తుది నిర్ణయం చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ (CSKCL) చైర్మన్‌గా నియమితులైన శ్రీనివాసన్ తీసుకుంటారు.

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ గెలిచి శుభారంభం చేసిన చెన్నై.. ఆ తర్వాత ఆడిన 9 మ్యాచ్ ల్లో 8 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఓవరాల్ గా 14 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. వచ్చే సీజన్ కోసం మంచి జట్టును తయారు చేస్తాం అని ఐపీఎల్ సమయంలోనే ధోనీ చెప్పాడు.