Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌లో హై-వోల్టేజ్ డ్రామా! దివ్య ఎత్తుగడతో రచ్చ రచ్చ.. కొత్త కెప్టెన్ ఎవరంటే?

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌లో హై-వోల్టేజ్ డ్రామా! దివ్య ఎత్తుగడతో రచ్చ రచ్చ.. కొత్త కెప్టెన్ ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఊహించని మలుపులతో రసవత్తరంగా సాగుతోంది. హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. కెప్టెన్సీ అనేది ఇంట్లో అందరూ కోరుకునే అరుదైన అవకాశం కాబట్టి, కంటెండర్ల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఈ సీజన్‌లో బిగ్‌బాస్ కాస్త కొత్తగా ఆలోచించి, కంటెండర్లకు డైరెక్ట్‌గా గేమ్ ఇవ్వకుండా, హౌస్‌మేట్స్ సహాయంతో గెలిచే టాస్క్‌ను ఇచ్చారు. దీనివల్ల ఆటతో పాటు భావోద్వేగాలు, వ్యక్తిగత వైషమ్యాలు తెరపైకి వచ్చాయి.

 కెప్టెన్సీ రేసులో సంచలన పరిణామాలు
ఆరంభంలో సంజన, నిఖిల్‌, గౌరవ్‌, డిమాన్‌, సాయి, కల్యాణ్‌ వంటి పలువురు పోటీదారులు రేసు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత, కెప్టెన్సీ కోసం తనూజ, భరణి, రీతూ, ఇమ్మాన్యుయేల్‌, దివ్య, సుమన్‌ పోటీ పడాల్సి వచ్చింది. వీరిలో రైలెక్కి కూర్చునే హౌస్‌మేట్ ఒక కంటెండర్‌ను రేసు నుంచి తప్పించే అధికారం ఇవ్వడం ఈ టాస్క్‌లో కీలక మలుపు తీరుగుతుంది. కుర్చీ కోసం హౌస్‌మేట్స్ తీవ్రంగా పోటీపడగా, ఆ కీలక కుర్చీని ముందుగా కల్యాణ్ గెలుచుకున్నాడు. సరైనోడికి సాయం చేస్తానని చెప్పిన కల్యాణ్‌ను, దివ్య తన మాటలతో నమ్మబలికి, ఒప్పించి కుర్చీని తీసుకుంది. దివ్య తీసుకున్న సంచలన నిర్ణయంతోనే డ్రామా మొదలైంది.

 తనూజ వర్సెస్ దివ్య..

కుర్చీ తన ఆధీనంలోకి రాగానే దివ్య తన సపోర్ట్ ఇమ్మాన్యుయేల్‌కు అని ప్రకటిస్తుంది. అనూహ్యంగా తనూజను రేసు నుంచి తప్పించింది. దివ్య నిర్ణయంతో తనూజ షాక్‌కు గురైంది. 'నీకు కొంచెమైనా ఉందా? వ్యక్తిగత కారణాలతో ఎందుకు నన్ను ఎలిమినేట్ చేస్తున్నావు?' అంటూ దివ్యపై  తనూజ సీరియస్ అవుతుంది. తనూజను ఎలిమినేట్ చేయనని చెప్పినందుకే కల్యాణ్‌ దివ్యకు కుర్చీ ఇచ్చాడని గుర్తు చేసి వాదనకు దిగింది.

 ఎమోషనల్ అటాక్

మధ్యలో కల్యాణ్ కలగజేసుకుని 'నిన్ను నమ్మి ఇచ్చాను, నీ నుంచి లాక్కోవడం నాకు పెద్ద విషయం కాదు' అంటూ తన బాధను వ్యక్తం చేశాడు. మరోసారి కెప్టెన్సీకి అడుగు దూరంలో ఆగిపోయిన బాధతో తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. దివ్యతో నాతో మాట్లాడకు, నీకేమైనా పర్సనల్స్ ఉంటే హౌస్ బయట పెట్టుకో అని తీవ్రంగా చెప్పి..  వెక్కివెక్కి ఏడ్చేసింది. హౌస్‌మేట్ భరణి ఓదార్చేందుకు ప్రయత్నించినా..  ఆమె ఎవరితో మాట్లాడకుండా తన బాధను పంచుకోలేకపోయింది. ఈ సంఘటన హౌస్‌లో దివ్యపై వ్యతిరేకత పెంచింది.

మరో సారి కెప్టెన్ గా ఇమ్మాన్యుయేల్

చివరకు, కెప్టెన్సీ కోసం రీతూ ,  ఇమ్మాన్యుయేల్‌ మాత్రమే మిగిలారు. ఈ పోటాపోటీ రౌండ్‌లో హౌస్‌మేట్స్ మద్దతుతో చివరకు ఇమ్మాన్యుయేల్‌ విజయం సాధించినట్లు సమాచారం. టాస్క్ గెలవడానికి హౌస్‌మేట్స్ నుంచి సహాయం తీసుకోవడం వలన, ఈ కెప్టెన్సీ టాస్క్ హౌస్‌మేట్స్ మధ్య ఉన్న స్నేహాలు, శత్రుత్వాలను మరోసారి బయటపెట్టింది.  మరో వైపు ఈ వారం ఎలిమినేషన్ పై తీవ్ర ఉత్కంత నెలకొంది. ఆదివారం ఎపిసోడ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.