హైదరాబాద్ లో గంజాయి, హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. డ్రగ్స్ రవాణాలో కీలక నిందితుడితో సహా మరో ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితులనుంచి 5 కిలోల హాష్ ఆయిల్, 5 కిలోల గంజాయిని, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న డ్రగ్స్ విలువ 70 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. HNEW టీం, టాస్క్ ఫోర్స్, లంగర్ హౌస్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో శనివారం (డిసెంబర్13) ఈ అంతర్ రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు.
ఈ కేసులో బాలాజీ అనే నిందితుడిని విచారించగా ప్రధాని నిందితుడు వైకుంఠరావు బాగోతం బయటికి వచ్చింది. 2019 నుంచి వైకుంఠరావు డ్రగ్స్ రవాణా చేస్తున్నాడు. కారు డ్రైవర్ గా పనిచేస్తున్న వైకుంఠరావు.. ఒడిశానుంచి తక్కువ ధరకు డ్రగ్స్, గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ లో అమ్ముతున్నట్టు గుర్తించారు. గతంలో కూడా వైకుంఠరావుపై రెండు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈకేసులో వైకుంఠరావునుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వందమందిని అదుపులోకి తీసుకున్నట్లు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ తెలిపారు. వారిని రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించి డ్రగ్స్ బారినుంచి బయటికి తీసుకొస్తామన్నారు. వైకుంఠరావు దగ్గర డ్రగ్స కొనే వారంతా ఎక్కువ ఐటీ ఉద్యోగులు, విద్యార్థులే ఉన్నట్లు తెలిపారు. డ్రగ్స్ కు సంబంధించి సమాచారం వస్తే పోలీసులకు అందించాలని ప్రజలను కోరారు. వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

