- ప్యూరిటీ సర్టిఫికెట్లతో నకిలీ కడ్డీలు అంటగట్టి.. అసలు వెండితో జంప్
- అంతరాష్ట్ర ముఠా అరెస్ట్
- 8.4 కిలోల వెండితోపాటు రూ. 1.5 లక్షల నగదు సీజ్
పద్మారావునగర్, వెలుగు: వెండి వ్యాపారులను నమ్మించి నకిలీ కడ్డీలు అంటగడుతున్న ఐదుగురు సభ్యుల అంతరాష్ట్ర ముఠాను మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ ముఠా తొలుత వ్యాపారుల నమ్మకం పొందేందుకు ఒకటి రెండు సార్లు అసలు వెండిని ఇచ్చి లావాదేవీలు జరుపుతుంది.
ఆ నమ్మకంతోనే సికింద్రాబాద్ మహంకాళి స్ట్రీట్‌కు చెందిన వ్యాపారి హీరాలాల్ వర్మకు నకిలీ ప్యూరిటీ సర్టిఫికెట్లతో 10 కిలోల వెండి కడ్డీలను ఇచ్చి, అందుకు బదులుగా రూ. 15 లక్షల విలువైన 6.35 కిలోల స్వచ్ఛమైన వెండిని తీసుకుని ఉడాయించారు. నిందితులు వెళ్లిన తర్వాత పరీక్షించగా, ఆ కడ్డీల్లో అసలు వెండి లేదని ( జీరో ప్యూరిటీ) తేలడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.
రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్ ఆధారాలతో ప్రధాన నిందితుడు హృదయేశ్ కుమార్‌తో పాటు సుశీల్ కుమార్, ప్రిన్స్, రాజీవ్ జైన్, సోను కుష్వాహాను పట్టుకున్నారు. వీరి నుంచి 8.4 కిలోల వెండితోపాటు రూ. 1.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో ఈ ముఠా మహంకాళి పరిధిలో మరో 12.5 కిలోల వెండిని కాజేయడమే కాకుండా ఢిల్లీ, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాల్లోనూ మోసాలకు పాల్పడినట్లు తేలింది. నిందితులను పట్టుకున్న ఇన్స్పెక్టర్ రవికుమార్ బృందాన్ని డీసీపీ రక్షిత కృష్ణమూర్తి శనివారం అభినందించారు.

