నా ఎక్స్‌ పీరియెన్స్‌ అందరికీ చెప్పాలనే..!

నా ఎక్స్‌ పీరియెన్స్‌ అందరికీ చెప్పాలనే..!

మంజుల ఘట్టమనేని.. సూపర్‌‌‌‌స్టార్‌‌‌‌  కృష్ణ కూతురుగా అందరికీ తెలుసు. ప్రిన్స్‌‌ మహేశ్‌‌బాబు అక్కగా బాగా గుర్తుపడతారు. కానీ,  తనకంటూ ఐడెంటిటీ క్రియేట్‌‌ చేసుకోవాలనుకుంది. నటిగా, ప్రొడ్యూసర్‌‌‌‌గా, డైరెక్టర్‌‌‌‌గా తన టాలెంట్‌‌ నిరూపించుకుంది. తన ఎక్స్‌‌పీరియెన్స్‌‌,  నాలెడ్జ్‌‌ను పదిమందికి పంచాలనే ఉద్దేశంతో యూట్యూబ్‌‌ ఛానల్‌‌ కూడా స్టార్ట్‌‌ చేసింది. ఓటీటీల్లో మంచి కంటెంట్‌‌తో వస్తానని, మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు వర్క్‌‌ చేస్తున్నానంటోంది. ‘మనసుకు నచ్చింది’ చేస్తానని, అందరూ అలా ఉంటే హ్యాపీగా ఉంటారని చెప్తున్న మంజులతో చిట్‌‌చాట్‌‌.

యూట్యూబ్‌‌ ఛానల్‌‌ ఆలోచన ఎందుకు వచ్చింది?

లైఫ్‌‌లో నాకు ఎదురైన ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను, వాటి నుంచి నేర్చుకున్న విషయాలను నలుగురికి చెప్పాలనే కోరికతో ‘మంజుల ఘట్టమనేని’ యూట్యూబ్‌ ఛానల్‌‌ స్టార్ట్‌‌ చేశా. చాలా పుస్తకాలు చదివాను, వాటి నుంచి చాలా తెలుసుకున్నా. వాటినే అందరికీ చెప్తున్నా. నా స్టోరీ వల్ల ఒక్కరు ఇన్‌‌స్పైర్‌‌‌‌ అయినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడే మనం చేసే పనిలో తృప్తి దొరుకుతుంది. ప్రతిఒకరి లైఫ్‌‌లో అప్స్‌‌ అండ్‌‌ డౌన్స్‌‌ చూసి ఉంటారు. వాటిని ఎలా అధిగమించాలో నేను పర్సనల్‌‌గా ఎక్స్‌‌పీరియెన్స్‌‌ అయ్యాను. దాన్నే అందరికీ చెప్తే ఇబ్బందుల్లో నుంచి వాళ్లు బయటికి రాగలరనే నమ్మకంతో ఈ వీడియోలు చేస్తున్నా.

మీ వీడియోల్లో కనిపించే వాళ్లు ఎవరు?

వాళ్లంతా నా సోషల్‌‌ మీడియా ఫాలోవర్స్‌‌. నేను చెప్తున్న విషయం నలుగురికీ చేరుతుందా లేదా? అనే విషయం తెలుసుకునేందుకే ఒక ప్రయత్నం చేశా. వారం మొత్తం వెయిట్‌‌లాస్‌‌ గురించి వీడియోలు చేశా. దానివల్ల వాళ్లకు బెనిఫిట్‌‌ ఎంత ఉందో తెలుసుకోవాలని ఓపీనియన్స్‌‌, క్వశ్చన్స్‌‌ అడగాలని వీడియో చివర్లో చెప్పా. నా వెబ్‌‌సైట్‌‌ ‘మంజులా ఘట్టమనేని’ లో క్వశ్చన్స్‌‌ అడిగిన వాళ్లలో కొందరిని సెలక్ట్‌‌ చేసుకుని వాళ్లతో వీడియోస్‌‌ చేశా. ఎలాంటి ఫుడ్‌‌ తినాలి? ఎంత తినాలో? సిరీస్‌‌ చేశాను. దానిమీద కూడా ఒపీనియన్స్‌‌ తీసుకుంటున్నా.

 రెస్పాన్స్‌‌ ఎలా ఉంది?

చాలా మంచి రెస్పాన్స్‌‌ వస్తోంది. నిజానికి అందరిలో చాలా అవేర్‌‌‌‌నెస్‌‌ పెరిగింది. వాళ్ల లైఫ్‌‌స్టైల్‌‌ను మార్చుకునేందుకు, హెల్దీగా ఉండాలని చాలామంది అనుకుంటున్నారు. కోవిడ్‌‌ తర్వాత చాలామందిలో ఆ ఫీలింగ్‌‌ బాగా పెరిగిపోయింది. అందుకే వీడియోస్‌‌కు మంచి రెస్పాన్స్‌‌ వస్తోంది. నన్ను అడిగే క్వశ్చన్స్‌‌ కూడా చాలా డెప్త్‌‌గా అడుగుతారు. కంటెంట్‌‌ను బాగా అర్థం చేసుకుని అవేర్‌‌‌‌నెస్‌‌ను పెంచుకుంటున్నారు. ఈ మార్పు హ్యాపీగా ఉంది.

 వెల్‌‌నెస్‌‌పైనే ఎందుకు?

నేను వెల్‌‌నెస్‌‌ మీద చాలా కాన్సన్‌‌ట్రేట్‌‌ చేస్తా. రోజులో దాదాపు 3:30 గంటలు మెడిటేషన్‌‌, ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ చేస్తాను. ఎప్పుడైనా మైండ్‌‌ అండ్‌‌ బాడీ హెల్దీగా ఉంటేనే మనం అనుకున్నది సాధింగలమనేది నా మంత్ర. వెల్‌‌నెస్‌‌ను అలవాటు చేసుకునేందుకు నాకు చాలా ఏండ్లు పట్టింది. అలా కాకుండా ఈజీగా ఎలా అలవర్చుకోవచ్చో అందరికీ చెప్తున్నా.

ఇదంతా ఎలా అలవాటైంది?

ఇప్పుడు నేను చేస్తున్నవన్నీ నాన్న నుంచి నేర్చుకున్నవే. నాన్న రోజూ కచ్చితంగా ఎక్స్‌‌ర్‌‌‌‌సైజ్‌‌ చేస్తారు. హోమ్‌‌ఫుడ్‌‌ మాత్రమే తింటారు. అందరికీ చాలా రెస్పెక్ట్‌‌ ఇస్తారు. అసలు ఆయన ఎలా ఉంటారు? ఏం చేస్తారు? అని తెలుసుకోవడానికి ఒకరోజు మొత్తం నాన్నను గమనించాను. అలా ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. నేను కూడా హోంఫుడ్‌‌ మాత్రమే తింటాను. ఇంట్లో వండితే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఇంటి ఫుడ్‌‌లో టేస్ట్‌‌తో పాటు ప్రేమ కూడా ఉంటుందని నా ఫీలింగ్‌‌. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్‌‌ ఇవ్వాలని నాన్న చెప్తూ ఉంటారు. అదే నాకు, మహేశ్‌‌కు అలవాటు అయ్యింది.
మీరు వంట చేస్తారా?

అస్సలు రాదు (నవ్వుతూ). స్మూథీస్‌‌, స్టీమ్డ్‌‌ వెజీస్‌‌ లాంటివి మాత్రం చేస్తాను. మన వంటలు చేయడం రాదు. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ వంటగది వైపుకే వెళ్లలేదు. అందుకే వంట నేర్చుకోలేక పోయానేమో.

 చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాళ్లా?

బాగా.. అంటే బాగా అల్లరి చేసేదాన్ని. నేను చాలా రెబల్‌‌ కూడా. చిన్నప్పుడు అందరం బాగా కొట్టుకునేవాళ్లం. తిట్టుకునేవాళ్లం. నేను ఫైటింగ్‌‌లో మంచి ఎక్స్‌‌పర్ట్‌‌. పద్మ అక్కను బాగా కొట్టేదాన్ని. జుట్టు పీకేసేదాన్ని (నవ్వుతూ). గొడవల్లో ఎప్పుడూ నేనే ఫస్ట్‌‌. ‘గొడవ పడటంలో నువ్వు నన్ను బీట్‌‌ చేయలేవు’ అని సంజూతో చెప్తుంటాను.

ఫ్యామిలీ మీట్స్‌‌ అవుతుంటాయా?

ప్రతి అకేషన్‌‌కు అందరం కచ్చితంగా కలుస్తాం. మా సిస్టర్స్‌‌ అయితే ఫ్రీక్వెంట్‌‌గా మీట్‌‌ అవుతాం. మహేశ్‌‌ కూడా షూటింగ్స్‌‌ లేకపోతే మాతో టైమ్​ స్పెండ్‌‌ చేస్తాడు. సినిమా లైఫ్‌‌, ఫ్యామిలీ లైఫ్​ని మహేశ్‌‌ చాలా బ్యాలెన్స్‌‌డ్‌‌గా మెయింటెయిన్‌‌ చేస్తాడు.

డైరెక్షన్‌‌ చేశారు కదా.. దాన్ని కొనసాగిస్తారా?

డైరెక్షన్‌‌ ఈజ్‌‌ మై ఫస్ట్‌‌ లవ్‌‌. కచ్చితంగా కొనసాగిస్తా. నా ఫస్ట్‌‌ ప్రాజెక్ట్‌‌ అనుకున్నంత సక్సెస్‌‌ కాలేదు. అందుకే సెకెండ్‌‌ మూవీ చాలా కేర్‌‌‌‌ఫుల్‌‌గా చేయాలి అనుకుంటున్నా. దాని కోసం వర్క్‌‌ చేస్తున్నాను. నేను డెరెక్షన్​ చేస్తానని చెప్పినప్పుడు అందరూ చాలా సపోర్ట్‌‌ చేశారు. నాన్న చాలా హ్యాపీగా ఫీలయ్యారు. మహేశ్‌‌ కూడా చాలా హెల్ప్‌‌ చేశాడు. డైరెక్షన్‌‌ను నేను బాగా ఎంజాయ్‌‌ చేస్తాను. ఎందుకంటే ఫిల్మ్‌‌ మేకింగ్‌‌లో డెరెక్షన్​ అనేది ఫస్ట్‌‌పార్ట్‌‌.

 సినీ ఇండస్ట్రీలో లేడీ డైరక్టర్స్‌‌ ఎక్కువ లేరు కదా?

అవును, ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదు. టాలెంట్‌‌ అనేది అందరిలో ఉంటుంది. చెప్పాలంటే స్టోరీ టెల్లింగ్‌‌ స్కిల్స్‌‌ లేడీస్‌‌లోనే ఎక్కువగా ఉంటాయి. ఉమెన్‌‌ ఎమోషన్స్‌‌ను బాగా చూపించగలరు. చాలామంది ఉమెన్‌‌లో ఆ టాలెంట్‌‌ ఉంటుంది. కానీ, ఎందుకో బయటపెట్టరు. ఉమెన్‌‌ డైరక్టర్స్‌‌ ముందుకు వస్తే బాగుంటుంది. ఏదైనా ఉమెన్‌‌ ఓరియంట్‌‌ కథ సెట్‌‌ అయ్యి, అన్నీ అనుకూలిస్తే మొత్తం లేడీస్‌‌నే పెట్టి కచ్చితంగా ఒక మంచి ప్రాజెక్ట్‌‌ చేస్తా.

 మలయాళం సినిమా ఎక్స్‌‌పీరియెన్స్‌‌ ఏంటి?

ఆ ఎక్స్‌‌పీరియన్స్‌‌ వర్ణించలేనిది. తెలుగు సినిమాలో ఏం చేసినా వర్కవుట్‌‌ అవ్వకపోవడంతో ‘ఏం చేయాలా?’ అని ఆలోచిస్తున్న టైంలో ‘సమ్మర్‌‌‌‌ ఇన్‌‌ బెత్లహాం’లో చాన్స్‌‌ వచ్చింది. అందుకే వెంటనే ఒప్పుకున్నా. వాళ్లంతా చాలా నేచురల్‌‌గా, జనరల్‌‌గా యాక్ట్‌‌ చేస్తారు. వాళ్ల నుంచి చాలా నేర్చుకున్నా. 30 రోజుల్లో సినిమా తీసేశారు. తక్కువ బడ్జెట్‌‌లో మంచి క్వాలిటీ మూవీ తీశారు. ఆ 30 రోజులు ఊటీలో షూటింగ్‌‌ జరిగింది. చాలా బాగా ఎంజాయ్‌‌ చేశా.

 ఆ సినిమాకు రెస్పాన్స్‌‌ ఎలా ఉంది?

చాలా మంచి రెస్పాన్స్‌‌ వచ్చింది. ఇప్పటికీ చాలా మంది ‘మేడమ్‌‌ మీరు ‘సమ్మర్‌‌‌‌ ఇన్‌‌ బెత్లహాం’లో నటించారు కదా. మీ నటన చాలా బాగుంది’ అని సోషల్‌‌ మీడియాలో మెసేజెస్‌‌ అండ్‌‌ కామెంట్స్‌‌ పెడుతుంటారు. కేరళ, చిక్‌‌మగళూరు, బెంగళూరు ఎక్కడికి వెళ్లినా ఇప్పటికీ అందరూ గుర్తుపడతారు. ఆ ఫీలింగ్‌‌ చాలా బాగా అనిపిస్తుంది. 20 ఏండ్లు అయినా కూడా గుర్తుపెట్టుకుని అడుగుతుంటే చాలా హ్యాపీగా ఫీలవుతాను.

ఓటీటీలో కంటెంట్‌‌ చేసే ఆలోచన ఉందా?

ఓటీటీల కోసం కాన్సెప్ట్స్‌‌ రెడీ చేస్తున్నా. ఓటీటీ అనేది చాలా మంచి ప్లాట్‌‌ఫామ్‌‌. సినిమాల్లో లాగా పాటలు పెట్టాలి, జోక్‌‌లు పేల్చాలి అనేది లేకుండా మామూలుగా మంచి కాన్సెప్ట్స్‌‌తో తీస్తే బాగా చూస్తారు. అందుకే మంచి కథలను రెడీ చేసుకుంటున్నా.

 ఆర్గానిక్‌‌ ఫామింగ్‌‌ చేస్తున్నారట?

ఆర్గానిక్‌‌ ఫామింగ్‌‌ అంటే చాలా ఇష్టం. అన్ని ఆర్గానిక్‌‌ ప్రొడక్ట్స్‌‌నే యూజ్‌‌ చేస్తాను. మా కిచెన్‌‌ గార్డెన్‌‌లోనే అన్ని కూరగాయలు, ఫ్రూట్స్‌‌ ఉంటాయి. ఇంటికి దగ్గర్లో చాలాపెద్ద ఫామ్‌‌ కూడా ఉంది. ఆయిల్స్‌‌ కూడా మేము తయారు చేసుకున్నవే వాడతాం. అవి ‘సో ఫ్రెష్‌‌’ పేరుతో ఆన్‌‌లైన్‌‌లో కూడా దొరుకుతాయి. రిఫైండ్‌‌ ఆయిల్స్‌‌ వాడటం వల్ల చాలా హెల్త్‌‌ ఇష్యూస్‌‌ వస్తాయనే ఉద్దేశంతో ఆర్గానిక్‌‌ ఆయిల్స్‌‌ తయారు చేయడం మొదలుపెట్టాం. అన్ని రకాల ఆయిల్స్‌‌తో పాటు నెయ్యి కూడా ఉంటుంది. అమ్మమ్మ చిన్నప్పుడు ఏ2 నెయ్యి గుజరాత్‌‌ నుంచి తెప్పించేవారు. ఇప్పుడు అది మేమే చేస్తున్నాం. నెయ్యి, ఆయిల్స్‌‌ను ప్లాస్టిక్‌‌ బాటిల్స్‌‌లో కాకుండా గాజు సీసాల్లో ఇస్తాను.

మహిళ గురించి మీ మాటల్లో?

నాకు వెంటనే అమ్మే గుర్తొస్తుంది. అమ్మలో ఎన్ని మంచి క్వాలిటీస్‌‌ ఉంటాయి. ఓపిక, దేనైనా ఎదుర్కొనే శక్తి, ప్రేమ, భూమాతకు ఉన్నంత సహనం ఉంటుంది ఆమెకు. అవే క్వాలిటీస్‌‌ అందరు మహిళల్లో ఉంటాయి. ప్రతి ఒక మహిళ చాలా బ్యూటిఫుల్‌‌. పిల్లల్ని, ఫ్యామిలీని చాలా చక్కగా మెయింటెయిన్‌‌ చేస్తూ ఎంతో ఓర్పుగా ఉంటుంది మహిళ. అసలు ఒక మహిళను అలా చూస్తే ఆమెలో ఉంటే క్వాలిటీస్‌‌, ఆమె చేసే పనుల వల్ల మనసు చాలా ప్రశాంతంగా మారిపోతుంది. తెలియని పాజిటివ్‌‌ వైబ్రేషన్స్‌‌ వచ్చేస్తాయి. లక్ష్మీ దేవిని చూడండి ఎంత చక్కగా ఉంటుందో. ఆమెను చూడగానే పాజిటివ్‌‌
వైబ్స్‌‌ వస్తాయి. అలానే మహిళను చూడగానే ఒక రకమైన మంచి ఫీలింగ్‌‌ వస్తుంది. లోకంలోని ప్రతి మహిళ చాలా గ్రేట్‌‌.

కృష్ణగారితో బాండింగ్‌‌ ఎలా ఉంటుంది?

నాన్నతో చాలా క్లోజ్‌‌గా ఉంటాను. రోజూ కచ్చితంగా అమ్మని, నాన్నను కలుస్తాను. పెళ్లి అయ్యాక ఆ బాండింగ్‌‌ ఇంకా బాగా పెరిగింది. అమ్మాయి పెళ్లయ్యాక ఫిజికల్‌‌గానే వేరే ఇంటికి వెళ్తుంది అంతే.
ఆ బాండింగ్‌‌ అనేది ఎప్పటికీ అలానే ఉంటుంది. నిజానికి మా మధ్య ఇప్పుడు చాలా మెచ్యూర్డ్‌‌ కన్వర్జేషన్‌‌ ఉంటుంది. నాకు పెళ్లయ్యి, పాప పుట్టిన తర్వాత చాలా విషయాలు అర్థమయ్యాయి.
‘నేను చేసే అల్లరిని ఎంత భరించారో’ అనే విషయం నాకు పాప పుట్టిన తర్వాత కానీ తెలియలేదు.

ఫటాఫట్‌‌

ఇష్టమైన ఫుడ్‌‌? స్టీమ్డ్‌‌ వెజీస్‌‌
ఇష్టమైన హీరో? ఎప్పటికైనా నాన్నే
మీ గురించి ఎవరికీ తెలియన సీక్రెట్‌‌? నాకు సిగ్గు ఎక్కువ
మీలో మీకు నచ్చే విషయం? పాజిటివిటీ నచ్చని విషయం
చాలా చిన్న, అనవసరమైన విషయాలకు ఇరిటేట్‌‌ అయ్యి టైం వేస్ట్‌‌ చేసుకుంటా.
ఫేవరెట్‌‌ ట్రావెలింగ్‌‌ స్పాట్‌‌ లండన్‌‌
ఇంట్లో మిమ్మల్ని ఏమని పిలుస్తారు? నాన్న ‘మంజి’ అని పిలుస్తారు.
మిగతావాళ్లు ‘మంజు’ అంటారు.

::: తేజ తిమ్మిశెట్టి