IND vs NZ: టీమిండియాకు తమిళనాడు స్పిన్నర్ సవాల్.. ఎవరీ ఆదిత్య అశోక్..?

IND vs NZ: టీమిండియాకు తమిళనాడు స్పిన్నర్ సవాల్.. ఎవరీ ఆదిత్య అశోక్..?

ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. ఆదివారం (జనవరి 11) వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేస్తుంది. స్టార్ ప్లేయర్స్ తో టీమిండియా పటిష్టంగా కనిపిస్తుంటే.. మరోవైపు కివీస్ జట్టులో అనుభవం లేకుండా పోయింది. ఫాస్ట్ బౌలర్ క్రిస్టియన్ క్లార్క్ తొలి వన్డే మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. బ్రేస్ వెల్ కెప్టెన్సీలోని కివీస్.. టీమిండియాకు అడ్డుకోవడం పెను సవాలుగా మారింది. ఈ మ్యాచ్ లో ఇండియాకు ప్రత్యర్థిగా తమిళ నాడు స్పిన్నర్ ఆడనుండడం విశేషం.     
         
ఇండియాతో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు ప్లేయింగ్ 11లో భారత సంతతి ప్లేయర్ ఉన్నాడు. తొలి వన్డే కోసం కివీస్ ప్రకటించిన ప్లేయింగ్ 11లో ఆదిత్య అశోక్ స్థానం దక్కించుకున్నాడు. టాస్ సమయంలో న్యూజిలాండ్ కెప్టెన్ ఆదిత్యను ఫ్రంట్‌లైన్ స్పిన్నర్‌గా ధృవీకరించాడు. కివీస్ తరపున ఆడుతున్న ఆదిత్య అశోక్ తమిళనాడులోని వెల్లూరులో జన్మించాడు. అతనికి కేవలం నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతని కుటుంబం న్యూజిలాండ్‌కు వెళ్లింది. అక్కడే పెరిగిన అశోక్ న్యూజిలాండ్ జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. 

2020లో సౌతాఫ్రికాలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించాడు. 2023 ప్లంకెట్ షీల్డ్ టోర్నీలో  నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌పై 7 వికెట్లు పడగొట్టి జాతీయ సెలక్టర్ల దృష్టి ఆకర్షించాడు. 2023లో కివీస్ తరపున అరంగేట్రం చేశాడు. ఈ 23 ఏళ్ళ లెగ్ స్పిన్నర్ న్యూజిలాండ్ తరపున 2 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి రెండు వికెట్లు తీసుకున్నాడు. న్యూజిలాండ్ తరపున ఆడిన అజాజ్ పటేల్, ఇష్ సోధి, రచీన్ రవీంద్ర లాంటి ఆటగాళ్లు కూడా భారత సంతతికి చెందినవారే కావడం విశేషం. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ 28 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.