- ఐఎన్‌టీయూసీ ఎస్‌డబ్ల్యూయూ డిమాండ్
- లేదంటే నిరవధిక దీక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినా పైసా ఖర్చులేని హామీలను కూడా అమలు చేయడం లేదని, దీనికి నిరసనగా త్వరలోనే నిరవధిక నిరాహార దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఐఎన్‌టీయూసీ ఎస్‌డబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఐఎన్‌టీయూసీ ఆఫీసులో ముఖ్య నేతలతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఆర్టీసీలో యూనియన్లను అనుమతించాలని, ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై నయా పైసా భారం పడదని, అయినా ఈ విషయంపై ప్రభుత్వం రెండేండ్లుగా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఈ నెల 31లోపు దీనిపై ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో నిరవధిక దీక్షపై మరోసారి సమావేశమై తేదీని ప్రకటించి, నిరసనకు దిగుతామని రాజిరెడ్డి హెచ్చరించారు.
