- ఫ్యూచర్ సిటీలో స్పేస్ సిటీ, గ్లోబల్ సమిట్‌లో ప్రత్యేక ప్రదర్శన
- డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్
- భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఆయా దేశాల్లో ప్రత్యేక రోడ్ షోలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్‌తో పాటు వేగంగా విస్తరిస్తున్న స్పేస్‌టెక్ రంగానికీ ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ గ్లోబల్ సమిట్‌లో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ ఇప్పటికే అంతర్జాతీయ ఏరోస్పేస్ సంస్థలు, విమాన విడిభాగాల తయారీ, ఏవియానిక్స్, ప్రెసిషన్ ఇంజినీరింగ్, ఎంఆర్‌ఓ రంగాలకు కీలక కేంద్రంగా ఉండగా.. ప్రైవేట్ స్పేస్ రంగంలోనూ కొత్త కంపెనీలు, స్టార్టప్‌లు వరుసగా అడుగుపెడుతున్నాయి. స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ తయారీ, ప్రయోగ సాంకేతికతలో దూసుకెళ్తుండగా.. ధ్రువ స్పేస్ ఉపగ్రహ వ్యవస్థలు, శాటిలైట్ ప్లాట్‌ఫామ్‌లలో కార్యకలాపాలు విస్తరిస్తోంది.
హైదరాబాద్‌కు చెందిన టేక్‌మీ2స్పేస్ రూపొందించిన స్వదేశీ శాటిలైట్ బ్యాటరీ ప్యాక్ విక్రమ్–1 ప్రయోగంలో విజయవంతంగా వినియోగమై ఫ్లైట్ హెరిటేజ్ సాధించింది. ధ్రువ స్పేస్‌కు ఇటీవల అంతరిక్ష్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ నుంచి రూ.60 కోట్ల పెట్టుబడి లభించడం కూడా రాష్ట్రంలో స్పేస్‌టెక్ రంగానికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో పెద్ద కంపెనీలతో పాటు కొత్తగా ఏర్పడుతున్న స్పేస్‌టెక్ స్టార్టప్‌లు, డీప్‌టెక్ సంస్థలు, శాటిలైట్ తయారీ, రాకెట్ టెక్నాలజీ, స్పేస్ ఎలక్ట్రానిక్స్, ప్రొపల్షన్, ఎర్త్ అబ్జర్వేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్ రంగాల్లోని సంస్థలను తెలంగాణకు ఆకర్షించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది.
పెట్టుబడులు, పరిశోధన–అభివృద్ధి కేంద్రాలు, తయారీ యూనిట్లు, టెస్టింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక స్టార్టప్‌లకు అంతర్జాతీయ కంపెనీలతో భాగస్వామ్యాలు కల్పించడం, ఎంఎస్‌ఎంఈలను గ్లోబల్ సప్లై చెయిన్‌లోకి అనుసంధానం చేయడం లక్ష్యంగా పెట్టుకోనుంది. స్పేస్‌టెక్ సంస్థల కోసం ప్యూచర్ సిటిలో ప్రత్యేక ‘స్పేస్ సిటీ’ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో.. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఏరోస్పేస్ బలాన్ని, కొత్తగా ఎదుగుతున్న స్పేస్‌టెక్ ఎకోసిస్టమ్‌ను కలిపి ప్రపంచ పెట్టుబడిదారులకు పరిచయం చేసేలా ఇన్వెస్ట్ తెలంగాణ సమిట్‌లో ప్రత్యేక ప్రజెంటేషన్లు, పెట్టుబడి అవకాశాలను ప్రదర్శించాలని ప్రభుత్వం భావిస్తోంది.
బ్రిక్స్ తరహాలోనే ఇన్వెస్ట్ తెలంగాణకు ఏర్పాట్లు: శ్రీధర్ బాబు
సమిట్ఏర్పాట్లు కేవలం పెట్టుబడుల సమీకరణకే పరిమితం కాకుండా, తెలంగాణ సంప్రదాయాలు, సాంస్కృతిక విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫైవ్ స్టార్ హోటళ్ల వాతావరణం దేశవ్యాప్తంగా ఎక్కడైనా సాధారణంగానే ఉంటుందని.. మన రాష్ట్ర ప్రత్యేకతను దేశ విదేశీ ప్రతినిధులకు పరిచయం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు. బతుకమ్మ పండుగ ప్రాశస్త్యం, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఇక్కడి ప్రత్యేక వంటకాలు ప్రధానంగా ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారిణి హరిచందనకు సూచించారు.
తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి దాదాపు 2 వేల నుంచి 3 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి మన సంస్కృతి ఒక దృశ్యకావ్యంగా నిలిచిపోవాలని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన జీ20, బ్రిక్స్ సమిట్‌ల తరహాలోనే సాయంత్రం వేళల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు మన వారసత్వాన్ని సమున్నతంగా చాటిచెప్పేలా ప్లాన్ చేయాలన్నారు.
సమిట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి: డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్రానికి పెట్టుబడులను భారీగా ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్ - 2026’ ఏర్పాట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. బుధవారం సెక్రటేరియెట్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, సీఎస్ సంజయ్ జాజు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాట్లు, ప్రచారం, రోడ్‌షోల నిర్వహణపై డిప్యూటీ సీఎం కార్యాచరణను ఖరారు చేశారు. సదస్సు నిర్వహణ పర్యవేక్షణకు సీనియర్ అధికారులతో దాదాపు 10 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామని, పనుల రూపకల్పన, బడ్జెట్ అంచనాలు, ఆమోదాల ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ప్రతిరోజూ కార్యక్రమాలు జరిగేలా పనులు మొదలుపెట్టాలన్నారు.
గతంలో కుదిరిన ఎంవోయూలను కూడా సమీక్షించి, వాటి అమలు పురోగతిని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్న దేశాలు, నగరాలు, రంగాలను గుర్తించి దేశీయ, అంతర్జాతీయ రోడ్‌షోలు నిర్వహించేందుకు స్పష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. ప్రస్తుతం అనుకుంటున్న 4 హాల్స్ ను 6 లేదా 8కి పెంచేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
