- గ్యాస్పై రూ.300 వరకు లాస్.. దేశీయంగా ఉత్పత్తి పెంపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై తీవ్ర నష్టాలు వస్తున్నాయి. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రిపోర్ట్ ప్రకారం, ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీ సంస్థలు లీటరు పెట్రోల్ పై రూ.8 చొప్పున, డీజిల్ పై రూ.9 చొప్పున నష్టపోతున్నాయి.
వంట గ్యాస్ సిలిండర్‌పై సుమారు రూ.300 నష్టం వాటిల్లుతోంది. చమురు సంస్థలకు రోజుకు రూ.530 కోట్ల నష్టం వస్తోందని అంచనా. ఈ నెల 21న ముడి చమురు ధర బ్యారెల్ కు 117.4 డాలర్లకు చేరడంతో నష్టాలు భారీగా పెరిగాయి. రిటైల్ ధరలను మార్చకపోవడం వల్ల ఈ సంస్థల లాభాలు, నగదు ప్రవాహంపై తీవ్ర ఒత్తిడి పడుతోందని ఇక్రా పేర్కొంది.
ఇదిలా ఉంటే, గల్ఫ్ దేశాలలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా వంటగ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉండటంతో, రాబోయే పండుగ సీజన్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్రం దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని భారీగా పెంచుతోంది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ రిఫైనరీలకు ఆదేశాలు జారీ చేసింది. రోజువారీ ఉత్పత్తిని సుమారు 63,810 టన్నులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
