వరంగల్, కరీంనగర్, వెలుగు: వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో భక్తుల పూజలు అందుకున్న గణనాథులు బుధవారం గంగమ్మ చెంతకు చేరారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా దాదాపు 28 వేలకుపైగా వినాయక విగ్రహాలు నిమజ్జనం చేశారు. బుధవారం నిర్వహించిన నిమజ్జన కార్యక్రమంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో డీసీపీ స్థాయి నుంచి ఎస్సై వరకు 150 మంది ఆఫీసర్లు విధుల్లో ఉండగా.. 2,150 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
గ్రేటర్ వరంగల్‌లో 1,650 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. వరంగల్, హనుమకొండ, కాజీపేటలలో రూ.2 కోట్లతో 17 ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లు చేశారు. 30 క్రేన్లు.. 145 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. మరో 500 మంది సహయక సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగ్ జిల్లాలో సైతం భక్తులు ఉత్సాహంగా గణనాథులనునిమజ్జనానికి తరలించారు.
సిటీలో పటాకులు కాల్చొద్దు.. డీజేలు పెట్టొద్దు : డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్ సిటీ, వెలుగు: నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు, బాణసంచాకు పూర్తిగా దూరంగా ఉండాలని ఉత్సవ కమిటీలకు డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. అధిక శబ్దాల వల్ల చిన్నారులు, వృద్ధులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి గణేశ్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేయాలని కోరారు.
గురువారం ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేసినప్పటి నుంచి ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలతో తనకు 13 ఏండ్ల అనుబంధం ఉందని గుర్తుచేశారు. రేపు, ఎల్లుండి భారీ సంఖ్యలో నిమజ్జనాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో సీపీలు, ఎస్పీలు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తుండగా, ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు 30 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
జీహెచ్‌ఎంసీ, విద్యుత్, జలవనరుల శాఖలతో సమన్వయం చేసుకుంటూ హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ముఖ్యంగా మహిళల భద్రతకు షీ టీమ్స్, టాస్క్‌ఫోర్స్ బృందాలను రంగంలోకి దించినట్లు పేర్కొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు సుదర్శన్, సందీప్, రాజ్‌కుమార్, వీణా, మహేష్ యాదవ్ శాంతియుతంగా నిమజ్జనాలు నిర్వహించేందుకు ఎంతగానో సహకరిస్తున్నారని ప్రశంసించారు.
