మే20న సిద్దరామయ్య ప్రమాణం... కేసీఆర్కు ఆహ్వానం .. జగన్కు నో

మే20న  సిద్దరామయ్య  ప్రమాణం... కేసీఆర్కు ఆహ్వానం .. జగన్కు నో

కర్ణాటకలో మే 20వ తేదీన కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా మే 20తేదీన సిద్దరామయ్య ప్రమాణస్వీకారం చేయనున్నారు.  ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ,ప్రియాంక చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నారు. వీరితో పాటు సిద్దరామయ్య ప్రమాణస్వీకారోత్సవానికి  తమిళనాడు, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఒడిశా ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపింది కాంగ్రెస్.  తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కాంగ్రెస్ ఆహ్వానించింది. అయితే ఏపీ సీఎం జగన్ కు మాత్రం ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.

కేసీఆర్ వెళ్తారా లేదా? 

సిద్దరామయ్య ప్రమాణస్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లరని తెలుస్తోంది. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ నేరుగా  పోటీ చేయకపోయినా  జేడీఎస్ కు సీఎం కేసీఆర్ మద్దతు ఇచ్చారు. అక్కడ బీజేపీ, కాంగ్రెస్ ఓటమిని కేసీఆర్ పరోక్షంగా కోరుకున్నారు.  అంతేకాకుండా దేశంలో కాంగ్రెస్, బీజేపీ లేని మూడో ఫ్రంట్ అధికారంలోకి రావాలని కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుపై మాట్లాడిన కేసీఆర్.. అక్కడి రాజకీయాలు వేరు ఇక్కడ రాజకీయాలు వేరని కాంగ్రెస్ విజయాన్ని కొట్టిపారేశారు. తెలంగాణ కన్నడ ఎఫెక్ట్ ఎంతమాత్రం  ఉండబోదని ఎద్దేవా చేశారు. ఈ పరిణామాల క్రమంలో సిద్దరామయ్య ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వెళ్లరని సమాచారం.  

4  రోజులు తరువాత  ఉత్కంఠకు తెర 

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగింది. ఎట్టకేలకు నాలుగు రోజులు తరువాత సీఎం ఎవరనే దానిపై స్పష్టత వచ్చింది. సుదీర్ఘ చర్చల తరవాత కాంగ్రెస్ హైకమాండ్ సిద్దరామయ్యనే సీఎంగా  ప్రకటించింది. డిప్యూటీ సీఎంగా  డీకే శివకుమార్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మే 20 న మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో వీరిద్దరూ ప్రమాణం చేయనున్నారు. వీరితో పాటుగా పలువురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్  ఏర్పాట్లలో మునిగిపోయింది.

136 సీట్లతో అధికారం

ఇటీవల జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 136 సీట్లతో అధికారాన్ని  చేజిక్కించుకుంది.  65 సీట్లు బీజేపీ గెలుచుకోగా 19 సీట్లతో జేడీఎస్  సరిపెట్టుకుంది.