- అక్కడి వారిని సంక్రాంతికి పిలిచి ఆంధ్రా ప్రజల ప్రేమను చూపాలి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- పిఠాపురంలో సంక్రాంతి మహోత్సవాలకు హాజరు
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను సంక్రాంతికి ఆహ్వానించి, గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని రుచి చూపించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆ రాష్ట్ర ప్రజలకు ఆంధ్రా ప్రజల ప్రేమను చూపించాలని పేర్కొన్నారు. శుక్రవారం ఏపీలోని పిఠాపురంలో నిర్వహించిన ‘పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు’ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ‘‘పిఠాపురం సంక్రాంతి ఉత్సవాలకు చిరునామా కావాలి. ఈ పండుగను అన్ని మతాలు జరపుకునే స్థాయికి ఎదగాలి” అని అన్నారు. పిఠాపురంలో ఏ చిన్న సంఘటన జరిగినా వైసీపీ నేతలు వైరల్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అవాస్తవాలను వైరల్ చేయడం మానుకోవాలని హితవు పలికారు. పిఠాపురంలో వచ్చి గొడవలు చేద్దామనుకుంటే ఏరేస్తానని హెచ్చరించారు. పిఠాపురం ప్రజలు తనకు కాపు కాయాలి కానీ, ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకూడదని సూచించారు. తనను బలవంతం చేస్తే మరింతగా పనిచేస్తానని చెప్పారు. అధికారం ఉన్నా.. లేకపోయినా.. చివరి శ్వాస వరకు ప్రజల కోసం పనిచేస్తానన్నారు. ప్రపంచంలో ఏం జరిగినా పిఠాపురం ఎమ్మెల్యేదే తప్పా అని ప్రశ్నించారు.
పులివెందులలో సొంత బాబాయ్‌ని చంపినా అది వార్త కాదు కానీ.. పిఠాపురంలో స్కూల్ పిల్లలు కొట్టుకుంటే అది పెద్ద వార్తగా చేసి, వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో బూతులు తిట్టడం, కేసులు పెట్టడం చేశారని, ఇక్కడ కూడా మళ్లీ అలాంటివి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. తన మాటలు మెత్తగా ఉంటాయని, చేతలు గట్టిగా ఉంటాయని హెచ్చరించారు.
