న్యూఢిల్లీ: ఎంతటి బౌలర్‌కైనా టీ20 క్రికెట్‌లో బౌలింగ్ చేయడం చాలా కష్టంగా మారుతోంది. బ్యాటింగ్‌కు సహకరించే పిచ్‌లు, స్ట్రోక్ ప్లేకు అనువుగా మారిపోయిన బ్యాట్‌లు, పొట్టి స్టేడియాలు, పించ్ హిట్టర్లు ఉండే షార్ట్ ఫార్మాట్‌లో వికెట్లు తీయడం, పరుగులను నియంత్రించడం పెద్ద సవాల్‌గా తయారైంది. అందుకే ఐపీఎల్‌తోపాటు పలు లీగ్‌ల్లో జట్లు కోట్లు పెట్టి మరీ బౌలర్లను దక్కించుకుంటున్నాయి. ప్రస్తుత క్రికెట్‌లో తమ స్పీడ్, స్పిన్, స్వింగ్, వేరియేషన్స్‌తో గడగడలాడించే పేసర్లు, స్పిన్నర్లు కొందరు మాత్రమే ఉన్నారు. తనకు నచ్చిన అలాంటి ట్యాలెంటెడ్ టాప్-5 వరల్డ్ టీ20 బౌలర్ల గురించి చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ పలు విషయాలు పంచుకున్నాడు.
లంక పేసర్ లసిత్ మలింగ, పాక్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీకి తన ఇష్టమైన బౌలర్ల లిస్ట్‌లో తొలి రెండు స్థానాలు ఇచ్చిన వాట్సన్.. ఆ తర్వాతి ప్లేస్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు చోటిచ్చాడు. బుమ్రా అత్యద్భుత బౌలర్ అని వాట్సన్ కొనియాడాడు. ‘బుమ్రా ఆల్‌రౌండ్ ప్యాకేజీలా కనిపిస్తాడు. అతడికి ఇప్పుడు 26 ఏళ్ల వయస్సే. కానీ ఆటపై బుమ్రా ప్రభావం, ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో అతడి ప్రతిభ ముచ్చట గొల్పుతోంది. అతడు మంచి వేగంతో బౌలింగ్ వేస్తాడు. బాల్‌ను రెండు వైపులా స్వింగ్ చేయగలడు. పేస్‌లో మార్పులు చేయడం, యార్కర్లను అద్భుతంగా వేయడం అతణ్ని ఫేస్ చేసే బ్యాట్స్‌మన్‌కు సవాల్ విసురుతోంది. అతడు తన టీ20 కెరీర్ ముగిసే సమయానికి ఇంకా పెద్ద స్థాయిలో ఉంటాడు’ అని వాట్సన్ చెప్పాడు.

