IPL 2024: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు నిలిపివేయాలని హైకోర్టులో పిల్

IPL 2024: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు నిలిపివేయాలని హైకోర్టులో పిల్

మొహాలీ: ముల్లన్‌పూర్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు  నిర్వహించకుండా బీసీసీఐ-పీసీఏను నిషేధించాలని పంజాబ్, హర్యానా హైకోర్టులో PIL (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) దాఖలయ్యింది. ఈ మేరకు న్యాయవాది సునైనా అధ్యక్షతన నిఖిల్ థమ్మన్ అనే న్యాయ విద్యార్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తక్షణమే ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్ల విక్రయాలపై నిషేధం విధించాలని పిటిషనర్ తన ఫిర్యాదులో కోరారు. 

అనధికార ప్రదేశంలో స్టేడియం నిర్మించబడిందని, 2006 నాటి పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్‌ను ఉల్లంఘించి నిర్మాణం చేపట్టినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ ప్రకారం, సెప్టెంబర్ 14, 2006 నాటి నోటిఫికేషన్ ప్రకారం, 1.5 లక్షల చదరపు మీటర్ల నిర్మాణ విస్తీర్ణం కంటే ఎక్కువ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతి తప్పనిసరి. ప్రాజెక్ట్ సైట్ ఎకో-సెన్సిటివ్ జోన్‌లో లేదా 10కిమీ వ్యాసార్థంలో ఉన్నట్లయితే, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ నుండి క్లియరెన్స్ పొందాలి. అవేవీ లేకుండానే స్టేడియం నిర్మాణం పూర్తిచేసినట్లు తెలిపారు. మార్చి 15, 2011న పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన సూచనలను పిటిషనర్ తన ఫిర్యాదులో మరింత ప్రస్తావించారు.

ప్రస్తుత ఐపీఎల్ 2024లో ముల్లన్‌పూర్‌ స్టేడియం మరో నాలుగు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. పిల్ దాఖలైన నేపథ్యంలో బీసీసీఐ-పీసీఏ అధికారులు ఈ విషయాన్ని ఎలా పరిశీలిస్తారో చూడాలి. కాగా, 41 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో దాదాపు 33,000మంది కూర్చునే సామర్థ్యంతో 2021లో ఈ స్టేడియాన్ని నిర్మించారు.