
న్యూఢిల్లీ: ఐపీఎల్–18 ఫైనల్‌ను మరింత ప్రత్యేక ఆకర్షణగా నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతం చేసిన మన సాయుధ దళాలను ఈ మ్యాచ్ సందర్భంగా సత్కరించనున్నారు. ఈ మేరకు త్రివిద దళాధిపతులకు ఆహ్వానం పంపినట్లు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మంగళవారం వెల్లడించారు. ‘ఆపరేషన్ సిందూర్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి ఐపీఎల్ ఫైనల్‌కు భారత సాయుధ దళాల అధిపతులు, ఉన్నత స్థాయి అధికారులు, సైనికులకు ఆహ్వానం పంపాం.
ఈ పోరాటంలో మన సాయుధ దళాల ధైర్య సాహసాలు, దేశ రక్షణ కోసం వారు చేస్తున్న నిస్వార్థ సేవ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. సిందూర్‌కు సంఘీభావంగా ఐపీఎల్ ముగింపు వేడుకలను సాయుధ దళాలకు అంకితమివ్వాలని, మన హీరోలను గౌరవించాలని మేం నిర్ణయించాం. ఆర్మీ జనరల్ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ దినేశ్ కే త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్, మిలిటరీ టాప్ ర్యాంక్ అధికారులు, పలువురు జవాన్లను ఈ వేడుకలకు ఆహ్వానించాం ’ అని సైకియా తెలిపారు.