హైదరాబాద్, వెలుగు : పుష్కరకాలంగా అప్రతిహతంగా సాగుతున్న ఐపీఎల్ మెగా లీగ్‌లో పన్నెండో సీజన్‌కు ఘనమైన ముగింపు పలికేందుకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, మాజీ చాంప్ ముంబై ఇండియన్స్ ఆదివారం ఇక్కడి రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగే మెగా ఫైనల్లో అమీతుమీకి రెడీ అయ్యాయి. గత చరిత్ర చూసుకున్నా.. ప్రస్తుత బలాబలాలు చూసుకున్నా రెండు జట్లూ వేటికవే సాటి. లీగ్ అసాంతం అద్భుత ఆటతీరును కనబరిచి తుదిపోరుకు దూసుకొచ్చిన ముంబై, చెన్నై ఆఖరాటలోనూ కొదమ సింహాల్లా గర్జించేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. లీగ్ దశలో రెండు సార్లు, తొలి క్వాలిఫయర్లోనూ ధోనీసేనను ఓడించిన ముంబైది కాస్త పైచేయిగా కనిపిస్తోంది. కానీ, సెకండ్ క్వాలిఫయర్‌లో ఆడిన తీరు, ఢిల్లీని ఓడించిన తీరు చూశాక చెన్నైని ఏమాత్రం తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. దాంతో, ఫలితం ఎలా ఉన్నా సమ ఉజ్జీల ఫైనల్ ఫైట్ ఫ్యాన్స్‌కు కిక్కెక్కించడం గ్యారంటీ అనిపిస్తోంది.
చెన్నై జోష్‌లోకి..
రెండేళ్ల నిషేధం తర్వాత గతేడాది రీ ఎంట్రీలోచాంపియన్గా నిలిచిన చెన్నై ఈసారి కూడా వెటరన్ల అండతో విజృంభిస్తోంది. అందరికంటే ముందుగానే ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ధోనీసేన చివరి దశలో కాస్త తడబడింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడిన సూపర్ కింగ్స్.. హోమ్‌గ్రౌండ్‌లో ఫస్ట్ క్వాలిఫయర్‌లో పరాజయం పాలై నిరాశ పరిచింది. కానీ, వైజాగ్‌లో ఢిల్లీని చిత్తు చేసి ఎనిమిదోసారి టైటిల్ వేటకు దూసుకొచ్చిన డ్యాడీస్ ఆర్మీ మళ్లీ ఫుల్ కాన్ఫిడెన్స్‌లోకి వచ్చింది. ఓపెనర్ల వైఫల్యంపై బెంగ కూడా తీరిపోయింది. ఓపెనర్ షేన్ వాట్సన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. వైజాగ్‌లో డుప్లెసిస్‌తో పాటు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఒల్సిన అవసరం ఉంది. కెప్టెన్ ధోనీ, సురేశ్ రైనా జోరు మీదున్నారు. గత రెండు మ్యాచ్‌ల్లో కీలక పరుగులు చేసిన అంబటి రాయుడు కూడా టచ్‌లోకి రావడంతో సూపర్ కింగ్స్ బ్యాటింగ్ దుర్భేధ్యంగా మారిపోయింది. జడేజా, డ్వేన్ బ్రావో ధనాధన్ బ్యాటింగ్‌తో మెరిసే సమర్థులే. బౌలింగ్‌లో సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్, యువ పేసర్ దీపక్ చహర్ అద్భుతంగా రాణిస్తున్నారు. పవర్‌ప్లేలో వికెట్లు తీసి చహర్ శుభారంభాలు ఇస్తుంటే మిడిల్ ఓవర్లలో తాహిర్‌తో పాటు హర్భజన్, జడేజా ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. ఢిల్లీపై గొప్పగా బౌలింగ్ చేసిన డ్వేన్ బ్రావో ఈ మ్యాచ్‌లోనూ కీలకం కానున్నాడు. గత మ్యాచ్‌లో ఎక్స్ట్రా బౌలర్‌తో బరిలోకి దిగిన ధోనీ అదే టీమ్‌ను కొనసాగిస్తాడా లేక శార్దుల్ ఠాకూర్ ప్లేస్‌లో బ్యాట్స్‌మన్ మురళీ విజయ్ను తీసుకుంటాడా అనేది చూడాలి.
ముంబై యమ జోరులో..
ముంబై ఈ సారి మొదటి నుంచి నిలకడగా ఆడుతోంది. ఓటమితో లీగ్‌ను ఆరంభించినా.. తర్వాత వరుస విజయాలతో సునాయాసంగా ప్లేఆఫ్స్‌కు దూసుకొచ్చింది. చివరి దశలో మరింత చెలరేగి ఆడిన రోహిత్‌సేన టాప్ ప్లేస్నూ కైవసం చేసుకుంది. ఆఖరి లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను, తొలి క్వాలిఫయర్‌లో చెపాక్ స్టేడియంలో చెన్నైని చిత్తుగా ఓడించి ఫుల్జోష్లోకి వచ్చేసింది. బ్యాటింగ్‌లో ఓపెనర్ డికాక్ చెలరేగి ఆడుతున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ నిలకడగా రాణిస్తుండగా మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్ బాధ్యత తీసుకుంటున్నాడు. క్వాలిఫయర్‌లో స్లో వికెట్‌పై మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ చేశాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి ఎంత చెప్పినా తక్కువే. విధ్వంసకర బ్యాటింగ్.. పదునైన పేస్‌తో విజృంభించే అతను ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తున్నాడు. అతని అన్న, మరో ఆల్‌రౌండర్ క్రునాల్‌కు బ్యాట్‌తో నిరూపించుకునే అవకాశం రాకపోయినా స్పిన్‌తో ప్రత్యర్థులకు వల వేస్తున్నాడు. ఇక, క్షణాల్లో ఫలితాన్ని తారుమారు చేసే విండీస్ వీరుడు కీరన్ పొలార్డ్ ఉండనే ఉన్నాడు. బౌలింగ్‌లో యార్కర్ల స్పెషలిస్ట్‌లు బుమ్రా, మలింగతో పేస్ పవర్ చూపెడుతుండగా, ఈ సారి యువ లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. చాలా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు అవసరమైన సమయాల్లో వికెట్లు తీస్తూ కీలక బౌలర్‌గా మారాడు. తొలి క్వాలిఫయర్ తర్వాత 4 రోజులు విశ్రాంతి దక్కడం ముంబైకి ప్లస్ పాయింట్.
చెన్నై
లీగ్ దశలో 9 విజయాలు, 5 ఓటములు, 18 పాయింట్లతో రెండో ప్లేస్.క్వాలిఫయర్–1లో ముంబై చేతిలో ఓటమి. క్వాలిఫయర్–2లో ఢిల్లీపై 6 వికెట్ల తేడాతో గెలుపు.
ముంబై
లీగ్ దశలో 9 విజయాలు, 5 ఓటములు, 18 పాయింట్లతో టాప్ ప్లేస్.క్వాలిఫయర్–1 లో 6 వికెట్ల తేడాతో చెన్నైపై విక్టరీ