IPL సీజన్-19లో ధర్మశాల వేదికగా అసలుసిసలు మ్యాచ్ జరగనుంది. లీగ్ మ్యాచుల్లో అదరగొట్టి ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన గుజరాత్, బెంగళూరు జట్లు ధర్మశాల వేదికగా తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే విషయం ఇప్పుడు కీలకంగా మారింది.
ఎందుకంటే.. క్వాలిఫయర్-1లో గెలిచి సత్తా చాటిన జట్లే ఎక్కువ సార్లు ఐపీఎల్ కప్ కొట్టాయి. క్వాలిఫయర్-1లో గెలిచిన జట్లు 15 సీజన్లలో 12 సీజన్లు ఫైనల్లో కూడా విజేతగా నిలిచి IPL కప్ గెలవడం గమనార్హం. 2011 నుంచి చూసుకుంటే.. ఐపీఎల్ చరిత్ర ఇదే చెబుతుంది.
IPL has been won by the team winning the Qualifier 1, 12 times out of 15. 🤯 pic.twitter.com/t0eb3DkcEU
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2026
ఈ గణాంకాలను గమనిస్తే.. ఈ క్వాలిఫయర్-1 మ్యాచ్ ఇరు జట్లకు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గుజరాత్ టైటాన్స్ ఒకసారి కప్పు కొట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా.. ఐపీఎల్ 2025 సీజన్లో ఐపీఎల్ కప్ సాధించి చిరకాల కలను సాకారం చేసుకుంది. ఈసారి కూడా అద్భుతంగా రాణిస్తూ RCB క్వాలిఫయర్-1 వరకూ వచ్చింది. ఈ సీజన్ కూడా ఐపీఎల్ కప్ కొట్టేది తామేనని RCB అభిమానులు బలంగా నమ్ముతున్నారు. గుజరాత్ కూడా RCBకి ఏమాత్రం తీసిపోదు.
గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఆర్సీబీ బ్యాటింగ్‌లో దూకుడు పెరిగింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అనుభవం, ఫామ్‌లో జట్టుకు ఉండటం కొండంత అండగా మారింది. ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, వెంకటేశ్ అయ్యర్ లాంటి యంగ్‌స్టర్స్‌ను విరాట్ నడిపిస్తున్న తీరు అద్భుతం. టాప్ ఆర్డర్ పరుగుల సునామీ సృష్టిస్తుండటంతో ఈ సీజన్‌లో ఆర్సీబీ రెండొందల మార్క్‌ను చాలాసార్లు దాటింది. ఇక రజత్ పటీదార్, జితేష్ శర్మ, రొమారియో షెఫర్డ్, టిమ్ డేవిడ్, క్రునాల్ పాండ్యాలతో కూడిన ఫినిషింగ్ టీమ్ కూడా అందుబాటులో ఉంది.
భారీ టార్గెట్‌ను నిర్దేశించాలన్నా.. ఛేదించాలన్నా వీళ్లలో ఏ ఒక్క ఇద్దరు బ్యాట్లు ఝుళిపించినా సరిపోతుంది. బౌలింగ్‌లోనూ ఆర్సీబీకి తిరుగులేదు. భువనేశ్వర్, హాజిల్‌వుడ్ స్టార్టింగ్‌లోనే ప్రత్యర్థులను దెబ్బతీసి ఒత్తిడి పెంచుతున్నారు. స్పిన్నర్లు క్రునాల్, సుయాష్ శర్మ, రసిక్ సలామ్ నుంచి ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటుంది. ధర్మశాలలో పంజాబ్‌పై గెలిచిన బెంగళూరుకు ఇక్కడి పరిస్థితులపై మంచి అవగాహన ఉంది.
ఇక గుజరాత్ విషయానికొస్తే.. సీజన్ ఆరంభంలో నిరాశపర్చిన గుజరాత్ రెండో అంచెలో మాత్రం అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ ఇస్తున్న ఆరంభాలు జీటీకి వరంగా మారాయి. వన్‌డౌన్‌లో జోస్ బట్లర్ హిట్టింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. కాకపోతే మిడిలార్డర్‌లో సుందర్, హోల్డర్, రాహుల్ తెవాటియా, నిశాంత్ సింధు అనుకున్న స్థాయిలో ఆడలేకపోవడం మైనస్‌గా మారింది. బౌలింగ్‌లో గుజరాత్‌ను కొట్టే వాళ్లే కనిపించడం లేదు.
మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ, ప్రసిధ్ కృష్ణ బుల్లెట్‌లాంటి బంతులతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఈ మ్యాచ్‌లోనూ వీళ్లు చెలరేగితే ఆర్సీబీకి ఇబ్బందులు తప్పవు. రషీద్ ఖాన్ స్పిన్ మాయాజాలం టీమ్‌కు ఎనలేని బలంగా మారింది. అయితే ధర్మశాలలో గుజరాత్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం బలహీనతగా మారింది.
